వివాదాస్పదంగా లక్ష్మీపార్వతి “డి-లిట్”!

-నన్నయ యూనివర్సిటీ డి-లిట్ ప్రదానం
-ఇలా కూడా పరిశోధన చేయొచ్చా? 

రాజమండ్రి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతికి రాజమండ్రి నన్నయ యూనివర్సిటీ  ఇటీవల డీలిట్ (DLitt) ను‌ ప్రదానం చేసింది. యూనివర్సిటీలో ఆమె డిలిట్ అడ్మిషన్ (2020) ఏపీ ముఖ్యమంత్రి సిఫార్సుతో వచ్చిందని లక్ష్మీ పార్వతి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే యూనివర్సిటీలో డి-లిట్ అడ్మిషన్ ఓపెన్ కాదా? ఒకవేళ ఓపెన్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారా? ఎంతమంది దరఖాస్తు చేశారు. అందులో లక్ష్మీ పార్వతి మెరిట్ లో ఎంపికయ్యారా? లేక సీఎం చెప్పారు కాబట్టి సీటు ఆమె కు ఇచ్చారా? ఒకవేళ నోటిఫికేషన్ లేకుండా ఓపెన్ అడ్మిషన్ ఇస్తే.. అలా తమకు కావలసిన వాళ్ళకు‌ నేరుగా అడ్మిషన్  ఇచ్చే ప్రొవిజన్ యూనివర్సిటీకి ఉందా? కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డి-లిట్ డిగ్రీ ఎత్తేసి చాలా కాలమైంది. మరి కొత్తగా ఏర్పాటైన నన్నయ యూనివర్సిటీలో డి-లిట్ ఎక్కడిది.? కొత్తగా పెట్టారా? పెడితే ఈ విషయమై అడ్మిషన్ ప్రకటన జారీ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి…

ఇక డి-లిట్ పరిశోథన విషయానికొస్తే…సాహిత్యం లో నన్నయ నుంచి సినారె వరకు తీసుకున్నారట. అలాగే రాజకీయ నాయకుల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు రాష్ట్రాన్నిపరిపాలించిన‌ ముఖ్యనాయకులను తీసుకున్నారు. అయితే చిత్రమేమంటేఇందులో రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇందులో లేరట. అంటే లక్ష్మీపార్వతి తీసుకున్న అంశం అసంపూర్ణం అదే కదా! సీనియర్ అయిన చంద్రబాబు లేకుండా గుడ్డిగా ఈ డి-లిట్ డిగ్రీని ఎలా ఆమోదించారన్న ప్రశ్న తలెత్తుతోంది.ఆరేళ్ళు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, అయిదేళ్ళు సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు తక్కువ వాడా?

నన్నయ విశ్వవిద్యాలయం పరిశోథన అంటే‌ దానికో స్థాయి ఉంటుంది పరిశోథన అంశం కూడా సాహిత్య పరంగా ఉండాలి. కానీ కలగూరగంపలా సాహితీకారుల్ని, రాజకీయ నాయకుల్ని కలగలపడం ఎంంత వరకు సబబు? ఇలాంటి పరిశోధన ఇదే ప్రథమమని అంటున్నారు.ఈ థీసిస్ ముందు మాటలో తొలివాక్యంలోనే‌ అడ్మిషన్, డిగ్రీ రావటానికి సహకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మీపార్వతి.

ఇదే అనేక అనుమానాలకు కారణమవుతోంది. దీని వల్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా ‘చంద్రబాబు’ అంటే లక్ష్మీపార్వతికి ఇష్టం ఉండక పోవచ్చు. అది ఆమె వ్యక్తిగతం. కానీ విశ్వవిద్యాలయంలో డి-లిట్ లాంటి ఓ అత్యున్నతమైన డిగ్రీ కోసం పరిశోధించేటప్పుడు, పరిశోథనాంశంలో ప్రధానమైన వ్యక్తిని పూర్తిగా విస్మరిస్తే,  ఆ థీసిస్ సంపూర్ణమెలా అవుతుంది. స్కూలు పిల్లాడు కూడా వేసే అతి సామానమైన ప్రశ్న ఇది. పైగా ఆమె అధికారిక పోస్టు (అకాడమీ చైర్మన్) పదవిలో ఉన్నారు. ఒక సీనియర్ సిఎంను పాస్ చేసి థీసిస్ సమర్పిస్తే డిగ్రీ ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు తలెత్తుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న?

లక్ష్మీపార్వతి డి-లిట్ డిగ్రీ వెనుక చట్టపరమైన,హేతుబద్ధమైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి..ఇదెలా సాధ్యమన్నది ఇప్పుడు విద్యావేత్తల బుర్రను తొలుస్తున్న ప్రశ్న. నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ ఎవరైనా దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

లేకుంటే యూనివర్సిటీ క్రెడిబులిటి దెబ్బతినే ప్రమాదముంది. లక్ష్మీపార్వతికి గైడ్ ఉన్నారా? ఉంటె ఆయన పేరేమిటి? ఒకవేళ లేకుంటే నేరుగా థీసిస్ సమర్పించవచ్చా? నెలన్నర క్రితం థీసిస్ సమర్పిస్తే ఆఘమేఘాల మీద క్లియరెన్స్ ఎలా వచ్చింది? ఈ ఒక్క‌కేసులో మాత్రమే ఇది జరిగిందా? లేక ఇతర కేసుల్లో కూడా ఇలానే జెట్ స్పీడుతో థీసిస్ లు వాల్యుయేషన్, వైవాలాంటి రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతోందా? ఏ థీసిస్ అయినా దాని పరిశోథక అంశాన్నిబట్టి సమగ్రంగా ఉండాలి కదా! మరి లక్ష్మీపార్వతి తీసుకున్న అంశం విస్తృతమైంది. అందులో ముఖ్య మంత్రులందరూ రావాలి. వారు సమాజంపై చూపిన ప్రభావం ఉండాలి.

చంద్రబాబు దొడ్డిదారిన సీఎం అయ్యాడు కాబట్టి అతడ్ని నేను పరిగణనలోకి.‌ తీసుకోలేదని లక్ష్మీ పార్వతి సాక్షి ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత  చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కదా..! అలాంటప్పుడు వెన్నుపోటు సాకు పనికిరాదు కదా? అలాగే చంద్రబాబు నాయుడు సమాజంపై ఎటువంటి  ప్రభావం చూపలేదు కాబట్టి ఆయన గురించి నేను రాయలేదు.. ఆయన్ను విస్మరించానని లక్ష్మీపార్వతి చెబుతున్నారు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినవారు సమాజంపై కించిత్ ప్రభావం కూడా చూపలేదా? మరీ విడ్డూరంగా ఉంది కదా! ఆమె చెప్పింది సరే.. యూనివర్సిటీ ఎగ్జామినర్లు ఏం చేస్తున్నట్టు? నిద్రపోతున్నారొ? అసలు ఈ థీసిస్ ను ఎగ్జామిన్ చేశారా? చెస్తే ఈ చిన్న లాజిక్ ను ఎలా మిస్సయ్యారు. మరి దీనికి జవాబేం చెబుతారు?

ఇక యూనివర్సిటీ డిలిట్ పరిశోథనాంశంపై  జరిగే సంపూర్ణ పరిశోథనకు మాత్రమే డి-లిట్  ఇవ్వాలి. మరి ఈ విషయంలో థీసిస్ అసంపూర్ణమని తెలుస్తోంది కదా? వ్యక్తుల రాగద్వేషాలు వారికే సొంతం కావాలి కానీ, ఇలా యూనివర్సిటీ పరిశోధనలో కూడా ప్రతిబింబించడం ఘోరమైన తప్పు. మరి దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు‌‌. యూనివర్సిటీలపై ఈ రకమైన రాజకీయ నీడలు అవాంఛితమే కాదు.. అనారోగ్యం కూడా.‌ యూనివర్సిటీల్లో ‘సెటిల్ మెంట్లు’ సహజమైపోయాయి.  ఈ విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది..‌అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా! ఎలాగైనా వ్యవహరించవొచ్చా.! నియమ నిబంధనలకు తిలోదకాలిచ్చి.‌. ఏకపక్షంగా తమకు కావల్సినట్లు అడ్మిషన్ పొంది, కావలసినవారి వివరాలను మాత్రమే థీసిస్లో పొందుపరిచి, ఇష్టం లేని వారి ప్రస్తావన చేయకపోవటం గో హత్య కంటే నేరం‌..! పాపం..!

ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపించి, నిజానిజాలను వెల్లడిస్తే బాగుంటుంది. అంతవరకు ఆ డిగ్రీని రీకాల్ చేసి,పెండింగ్ లో పెట్టాలి..! సామాజిక,విద్యా సంబంధమైన కార్యకర్తలు ఎవరైనా దీన్ని కోర్టులో సవాలు చేస్తే, అసలు నిజాలు తెలుస్తాయి. లేకుంటే రీసెర్చ్ స్టాండర్డ్స్, యూనివర్సిటీ క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతిన్నట్టే. పౌరసమాజం, విద్యావంతులు దీనిపై స్పందించాలని కోరుతున్నాను..!!

– ఎ.రజాహుస్సేన్..‌!