– టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఏంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నామని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయి. వాటి విలువ రూ.35,576 కోట్లు పైనే. ఇళ్ల పట్టాల పేరుతో 10 వేల ఎకరాలు, ఇసుక దందాలో రూ.9,750 కోట్ల దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో: 512ను రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా నియమించి పేద ప్రజల భూములను కొట్టేయాలని పన్నాగం పన్నారు.
ఇంతటి ప్రమాదకరమైన చట్టాన్ని దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం అమలు చేయలేదు. కానీ నల్ల చట్టంలోని లొసుగులను గ్రహించిన జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో 512ను జారీ చేసి అక్రమాలను సక్రమంగా మార్చే ఆయుధంగా నల్లచట్టాన్ని వాడుకున్నారు. సొంతవారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడను జగన్ రెడ్డి పన్నారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తాం. తాము భూమి యాజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి.
హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు. అందుకు ముందే స్థలం కొని తిరిగి ప్రభుత్వానికి అధిక రేటుకు అమ్మేశారు. అనేక రెట్లు పరిహారం కొట్టేశారు. తక్కువ ధరకు రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతల భాగోతాల గురించి సాక్ష్యాధారాలతో సహా శ్వేతపత్రంలో పొందుపరచడం జరిగింది.
ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. వీరి దగ్గర నుంచి ప్రతీ రూపాయి వసూలు చేసి ప్రజా ఖజానాకు జమ కడతాం. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను, తిరుపతి, రేణుగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారు. దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారు.
చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్లల ఆస్తి కాజేసేందుకు యత్నించారు. వీటిపై విచారణ చేపట్టాం. 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారు. తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు. వాటిలో భవనాలు కట్టుకున్నారు.
రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారు. భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు. భూముల రీసర్వే పేరుతో పాస్ బుక్ పై జగన్ చిత్రం ముద్రించుకున్నారు. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం రెండేసి ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారు. మొత్తం రూ.3 వందల కోట్ల విలువైన భూమిని కేటాయించుకున్నారు.
సహజ వనరుల దోపిడీ
కొండలను సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం అనకొండల్లా మింగేసి గుండులు కొట్టేశారు. ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యేలే అక్రమంగా భూగర్భవనరులను తొవ్వేశారు. వైసీపీ నేతలు ఇసుకాసురల అవతారాలెత్తి ఇసుకను మింగేశారు. వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం పేరుతో భవన నిర్మాణ రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూల్చింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను సైతం వైసీపీ నాయకులు వదిలి పెట్టలేదు.
గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జేపి వెంచర్స్ చెల్లించాల్సిన మోత్తం నుంచి రూ.800 కోట్లు మినహాయించారు. మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టకోవచ్చు.