Mahanaadu-Logo-PNG-Large

ఎన్నికల తీరుపై జగన్‌ వద్ద నేతల అనుమానం

-పార్టీ ముద్రపడిన గ్రామాల్లోనూ ఓట్లు రాలేదు
-ఈవీఎంలను పరిశీలించాల్సిన అవసరం ఉంది
-కుట్రలు చేసినా 40 శాతం ఓటింగ్‌ వచ్చింది
-పార్టీ పునర్‌వైభవం సాధిస్తుందని విశ్వాసం
-రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై ఆందోళన
-కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్‌ సూచన
-గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి

అమరావతి: వైసీపీ అధినేత జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజల కు మంచి చేశాం. కచ్చితంగా పార్టీ పునర్‌ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈవీఎం మేనేజ్‌మెంట్‌ అనుమానాలు, ఈసీ, కొంతమంది పోలీ సు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గినా కూడా 40 శాతం ఓటింగ్‌ రావడం వెనుక ఐదేళ్ల పాటు చేసిన కార్యక్రమాలే నిదర్శన మని పేర్కొన్నారు.

రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టి ఉంటుందని, ఈ ఐదేళ్ల పాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైసీపీ ప్రజల మనసులో ఉందని, పునర్‌ వైభవానికి ఇదే గట్టిపునాది అని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలను వ్యక్తం చేశారు. పార్టీ ముద్రపడిన గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం ల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల సంఘం, అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచిందన్న అనుమానం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని జగన్‌ వారికి సూచించారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీ పరం గా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.