అల్లూరికి నివాళులర్పించిన నేతలు

గుంటూరు, మహానాడు : అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా గుంటూరు నగర పౌర సంస్థల నేతలు శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితర నేతలు నాజ్ సెంటర్లోని  అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఆదివాసీల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 23 ఏళ్ల వయసులో నే తుపాకీ పట్టి ఉద్యమించి ప్రాణాలనర్పించిన గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 1882 మద్రాసు అటవీ చట్టానికి వ్యతిరేకంగా, పోడు వ్యవసాయానికి మద్దతుగా, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను కలుపుకొని సాయుధ పోరాటానికి నాంది పలికిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాల అమలుకు పౌర సమాజం కృషి చేయాలన్నారు.

మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ నేటికీ భారతదేశంలో దళిత, బహుజన వర్గాలు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నేతలు అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకొని కృషి చేయాలన్నారు.

రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్ర రాజు ప్రసంగిస్తూ నేటి యువత అల్లూరి పోరాట పటిమను, దృఢ సంకల్పాన్ని అలవరచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ నేతలు అచ్యుత ఇందుశేఖర్, పి.యస్. మూర్తి, ఎం భరత్, అవధానుల హరి, మానవత కోశాధికారి టి.వి.సాయిరాం తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.