– తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనంలోని ప్రధాన కమిటీ హాల్ లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరుగుతున్న 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్ వి.నరసింహాచార్యులు, జాయంట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ‘ సుస్థిరమైన అభివృద్ధిలో శాసన వ్యవస్థల పాత్ర’ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడారు.
సుస్థిరమైన అభివృద్ధి అనేది సామాజికంగా, ఆర్ధికంగా, పర్యావరణ పరంగా ప్రస్తుత కాలంతో పాటుగా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలు సుస్థిరమైన అభివృద్ధి కొరకు ఉద్దేశించిన చట్టాలను రూపొందించడం, అవసరమైన నియమాలను రూపొందించడంతో పాటుగా వాటి అమలును నిత్యం వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నాయి. అంతేకాకుండా, ఐక్యరాజ్య సమితి పేదరికం, అసమానత్వం, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులపై 2015 లో రూపొందించిన నియమాలు పార్లమెంట్, రాష్ట్రాల శాసన వ్యవస్థలకు మార్గదర్శకాలుగా తీసుకున్నాయి.
పార్లమెంట్ లో , రాష్ట్రాల శాసనసభ లలో సుస్థిరమైన అభివృద్ధి అమలు కోసం నిత్యం సమావేశాలు, సమాలోచనలు, చర్చలు జరపడం, చట్టాల రూపకల్పన, నియమావళి రూపొందిస్తున్నాయి. పార్లమెంట్ కమిటీలు అయిన పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ స్టాండింగ్ కమిటీలు చట్టాల రూపకల్పనలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. 1986 లో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ చట్టం, 1980 లో రూపొందించిన అటవీ సంరక్షణ చట్టం శాసన వ్యవస్థల నిబద్దతకు నిదర్శనం. సుస్థిరమైన అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వాలు కేటాయించే విధంగా శాసన వ్యవస్థలు కృషి చేస్తున్నాయి.
ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా రూపొందించడం ద్వారా ప్రభుత్వాలు పేదలకు ఉపాధి కల్పించడాన్ని హక్కుగా మార్చాయి. శాసనసభ, శాసనమండలిల సహకారంతో క్షేత్ర స్థాయిలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023 లో అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తుంది. అధికారం లోకి వచ్చిన మొదటి వారం రోజుల లోనే ప్రభుత్వ ఆర్టీసీ బస్సులలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గృహ వినియోగ గ్యాస్ సిలెండర్ పథకాలను అమలు చేసింది. ఈ రెండు పథకాల అమలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు తోడ్పడిందని వివరించారు.