– సీఎంకు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఎఎస్ శర్మ లేఖ
విశాఖపట్నం, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌కు కీర్తిప్రతిష్ఠలు పెరిగేలా రాజధానికి పెట్టుబడులు వస్తుండడం… అదే స్థాయిలో ఎన్డీయే ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పూనుకోవడం హర్షణీయమే.. అయితే, అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాల్లో అసమానతలు రాకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఎఎస్ శర్మ లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు యథాతథంగా…
ఈఎఎస్ శర్మ
విశాఖపట్నం
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
అమరావతి మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు కారణంగా, ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అసమానత రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మీ NDA ప్రభుత్వం తరఫున, కేంద్ర ఆర్థిక మంత్రి గారు, అమరావతి రాజధాని పథకానికి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి 15,000 కోట్ల రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించడం హర్షణీయం. ఆ బ్యాంకుల ప్రతినిధులు అప్పుడే మీ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టారని వార్తలు చూసాను.
ఆర్థిక మంత్రి గారు సూచించిన 15,000 కోట్ల రూపాయల సహాయం, రాష్ట్ర ప్రభుత్వానికి రుణం రూపంలో లభిస్తుందని, కేంద్రం స్పష్టం చేసింది.
ఒక వైపు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి గారు, ఇప్పటి అంచనాల ప్రకారం, అమరావతి ఖర్చు ముందు అంచనా చేసిన 41,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, ప్రాజెక్ట్ 30 నెలల్లో పూర్తి అవుతుందని సూచించారు (https://www.youtube.com/watch?v=7_KBTFK1Oxs). అంటే అమరావతి మీద ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసే దిశలో ఉన్నట్లు కనిపిస్తున్నది.
ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి తీసుకున్న అప్పులు, విదేశీ ద్రవ్య రూపంలో ఉండడం వలన, రుణభారం అధికంగా ఉంటుంది. రాజధాని ప్రాజెక్టు కారణంగా, మొత్తం రుణ భారం 50,000 కోట్ల రూపాయలకు పైగా వుంటే, ఆ రుణాలు తీర్చే బాధ్యత, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద ఉంటుంది.
అంటే, ప్రభుత్వం ఒకే జిల్లాలో, 50,000 కోట్ల రూపాయల ప్రజల నిధులను, 30 నెలల్లో ఖర్చు చేయడం కారణంగా, ఏటా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో, మిగిలిన ప్రాంతాల్లో చేసే ఖర్చులో, 50,000 కోట్ల రూపాయలు కొరత వచ్చి, ఆ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల కు రావాల్సిన నిధులలో కొరత రాగలదు. ఆ కారణంగా, రాష్ట్రంలో ప్రాంతీయ అసామాన్యత వచ్చే అవకాశం ఉంది.
గత అనుభవం ఆధారంగా, అమరావతి ప్రాజెక్టు లో, ప్రభుత్వం విదేశీ కంపెనీలకు భూములు ఇచ్చి, వారి సహాయంతో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటి కంపెనీలకు ప్రారంభ దశలో తక్కువ ధరలకు, భూములను ఇవ్వడం, వారు లాభాలు గణించేందుకు రాయితీలు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. ఆ రాయితీల భారం కూడా రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తుంది.
2014 లో కేంద్రం నోటిఫై చేసిన ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో, 46వ సెక్షన్ ప్రకారం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు, కేంద్రం ప్రత్యేకమైన సహాయం అందిస్తుందని చట్టపరంగా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు గురించి చట్టంలో ప్రస్తావించడం జరిగింది.
పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన లక్షలాదిమంది ఆదివాసీలకు అపారమైన నష్టం కలిగింది. ప్రాజెక్టు వలన లభ్యమయ్యే సాగునీటి సౌకర్యం కృష్ణ-గోదావరి ప్రాంతాలకే అధికంగా అందుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చే లాభం అంతగా ఉండదు.
కాని, ఏ కారణం వల్లనో, కేంద్ర ఆర్థిక మంత్రి గారు, బడ్జెట్ ప్రకటనలో అమరావతి ప్రాజెక్టు కోసమే ఖచ్చితంగా ఆర్థిక సహాయం మీద హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను ఇస్తామని కూడా ప్రకటించారు. ఆమె ఆ ప్రకటనలో విభజన చట్టంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు చెందిన హామీని నెరవేరుస్తామని, అస్పష్టంగా, రెండు మాటలు చెప్పి, ఎటువంటి ఆర్థిక సహాయం అందిస్తారో ప్రస్తావించలేదు. అది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలకు నిరాశ కలిగించింది.
ఉత్తరాంధ్ర జిల్లాలలో, SC/ST/OBC వర్గాలకు చెందిన వారు, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు అధికంగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో, సామాజిక అభివృద్ధి లో, అక్షరాస్యతలో, వెనుకబడిన ప్రాంతం.
ఉదాహరణకు, ఉత్తరాంధ్ర జనాభా, రాష్ట్ర జనాభాలో 19% ఉన్నా, అక్కడ సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, రాష్ట్రంలో సాగులో ఉన్న భూమి విస్తీర్ణంలో 4.7% మాత్రమే. రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం దృష్ట్యా, ఉత్తరాంధ్ర వాటా 15%, ప్రత్యక్షంగా నీటిపారుదల లభిస్తున్న భూముల విస్తీర్ణం 13% మాత్రమే ఉంది.
ఉత్తరాంధ్ర రైతులు చిన్నకారు రైతులు. రాష్ట్రంలో రైతుల తలసరి land holding సగటున 2.3 ఎకరాలు, కాని ఉత్తరాంధ్ర లో సగటు తలసరి land holding 1.5 ఎకరాలు మాత్రమే. అటువంటి చిన్నకారు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
నా ఉద్దేశంలో, అమరావతి రాజధాని ప్రాజెక్టులో, ఎయిర్ కండిషన్డ్ భవనాల కన్నా ముఖ్యం, పరిపాలన వికేంద్రీకరణ చేయడం. ప్రభుత్వం ప్రజల దగ్గరకు రావాలి, కాని ప్రజలు ప్రభుత్వాధికారుల చుట్టూ తిరిగే దుస్థితి రాకూడదు. ఆధునిక కమ్యూనికేషన్ సౌకర్యాల సహాయంతో అటువంటి పరిపాలన విధానం సులభంగా ప్రవేశపెట్టవచ్చు. అటువంటి వికేంద్రీకరణ వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కలిగే లాభం, అమరావతి భవనాల వలన, అక్కడ సృష్టించబడే మౌలిక సదుపాయాల వలన కలిగే లాభం కన్నా చాలా అధికంగా ఉంటుంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు న్యాయం కలగాలంటే, మీ ప్రభుత్వం తత్ క్షణం ఆ ప్రాంతాలకు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలకు, SC/ST/OBC సమాజాల అభివృద్ధి కోసం, కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేయాలి. అటువంటి సహాయం చేకూర్చే బాధ్యత కేంద్రానికి ఉంది. ఆ సహాయాన్ని తెచ్చుకునే బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. NDA లో భాగస్వాములైన మీ ప్రభుత్వం తలచుకుంటే అటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి రాబట్టే ఉపాయం చేపట్టవచ్చు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు పోవడం లేదు.
ఉదాహరణకు, గోదావరి నుంచి నీటిని శ్రీకాకుళం వరకు అందించగలిగే బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, ప్రకటనలకే పరిమితి అయింది, కాని ఆ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించబడ లేదు. నాగావళి వంశధారల మీద ప్రోజెక్టుల maintenance కోసం ప్రభుత్వం నిధులు సరిగా ఇవ్వడం లేదు. వంశధార-బహుదా నదుల అనుసంధానం గురించి మీ ప్రభుత్వం 2014-19 లో కొంత ముందుకు పోయినా, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆప్రోజెక్టును వెంక పెట్టడం జరిగింది. వంశధార నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఉన్న ప్రాంతానికి ఆ ప్రాజెక్టు వలన లాభం కలుగుతుంది.
వంశధార లో మిగులు 115 టీఎంసీ ల నీళ్ళల్లో మన రాష్ట్రానికి 50% వాటా ఉంది. ఆ వాటాను పూర్తిగా ఉపయోగించి పలాస వరకు సాగు నీటి సౌకర్యం కలిగించాలంటే, వంశధార మీద నేరడు ప్రాజెక్టును, ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా నిర్మించాలి. ఆ విషయంలో సుప్రీంకోర్టు లో ఒడిశా వేసిన కేసులకు పరిష్కారం రావాలంటే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి సరిఅయిన మార్గం కనుక్కోవాలి.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి లో చేస్తున్న పెట్టుబడులకు సమానంగా విద్యారంగంలో, ఆరోగ్య సౌకర్యాల మీద, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెట్టుబడులు చేయవలసిన అవసరం ఉంది
పెట్టుబడులు ప్రైవేట్ రంగం ద్వారా వస్తే, SC/ST/OBC రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణం మీద, ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ఆహార భద్రత కలిగించే వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా మీద సూచించిన సాగునీటి ప్రాజెక్టుల మీద, ప్రభుత్వం పెట్టుబడులు చేయవలసిన అవసరం ఉంది.
అమరావతి ప్రాజెక్టు ముందుకు పోవడం అవసరం. కాని వందలాది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను, అతి జాగ్రత్తతో, ప్రజా ప్రయోజనం కోసమే ఉపయోగించాలి. ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే రాయితీలను తక్కువ స్థాయికి పరిమితం చేసి, పొదుపుతో ముందుకు పోవాలని నా విజ్ఞప్తి.
రాజధాని మీద చేసే ఖర్చు, రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు దారి తీయకూడదు. రాజధాని నగరం ఎంత ముఖ్యమో, రాష్ట్రంలో ప్రతి నగరం, ప్రతి టౌన్, ప్రతి గ్రామం అంత ముఖ్యమని మీ ప్రభుత్వం గుర్తించాలి.
ఈ సలహాలను మీ ప్రభుత్వం అమలు చేస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు
ఈఎఎస్ శర్మ
విశాఖపట్నం
26-8-2024