Mahanaadu-Logo-PNG-Large

ప్రజలతో శెభాష్ అనిపించుకునేలా పాలన చేద్దాం

  • ఈ విజయం ప్రతీకారం కోసం కాదు… అభివృద్ధి, సంక్షేమం కోసం
  • ప్రణాళికబద్ధంగా నియోజకవర్గాల సమస్యలను పరిష్కరిద్దాం
  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
  • వ్యక్తిగత విమర్శలు పూర్తిగా నిరోధించాలి
  • జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్

‘ప్రజలు అందించిన ఈ ఘన విజయం కక్ష సాధింపు రాజకీయాల కోసం కాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అంతకంటే కాదు. వారు మనల్ని మనస్ఫూర్తిగా నమ్మి అఖండ విజయాన్ని అందించారంటే వారికి అత్యుత్తమ పాలన ఇవ్వాలని చెప్పడమే. నేను ఎప్పుడూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని తప్పి ప్రవర్తించలేదు. గత ప్రభుత్వానికి ఇది అర్థం కాలేదు. ఇప్పుడు అధికారంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించే బాధ్యతను తీసుకుంటామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష మొదటి సమావేశం జరిగింది. జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ ని పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొదట  పవన్ కళ్యాణ్ పేరును పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా… సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీ విలువలను, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా పని చేయాలి. పగలు, ప్రతీకారాలకు సమయం కాదు. దీనిని శ్రేణులకు కూడా అర్ధమయ్యేలా నాయకులు తెలియజెప్పాలి.

ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి
ప్రజలు జనసేన పార్టీని నమ్మి  పెద్ద బాధ్యతను ఇచ్చారు. దానిని సక్రమంగా నిర్వర్తించాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. నాతో సహా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా దానిని బాధ్యతగా తీసుకుందాం. భారతదేశంలో ఎంతోమంది రాజకీయ పార్టీలను దశాబ్దంపాటు ఏ అధికారం లేకుండా నడిపిన దాఖలాలు లేవు. జనసేన పార్టీ ప్రయాణం ప్రజల ప్రేమ, అభిమానం, నమ్మకం అనే ఇంధనంతోనే నడించింది.

నేను ఢిల్లీ వెళ్లినప్పుడు చాలా మంది జాతీయ స్థాయి నాయకులు- ఇంతకాలం పాటు ఏ అధికారం లేకుండా పార్టీని ఎలా నడిపారని అడుగుతున్నారు. ఇది పూర్తిస్థాయిలో జన సైనికులు, వీర మహిళలు సాధించిన విజయం. ఈ స్ఫూర్తిని వారి నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునేలా ఇకముందు కూడా మన ప్రయాణం ఉండాలి.

నియోజకవర్గాల్లో ప్రాధాన్య అంశాలను గుర్తించండి
 పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా మొదట నియోజకవర్గంలో కీలకమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులు పడుతున్న విషయాలను గుర్తించాలి. ఏవి మొదట ప్రాధాన్య అంశాలో తెలుసుకోండి. వాటిని తీర్చేందుకు ప్రాధాన్యం ఇద్దాం. ఒక వేళ కేంద్రంతో ముడిపడిన అంశాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పూర్తయ్యేలా చొరవ తీసుకుందాం. పార్టీ తరఫున కూడా ప్రత్యేక కమిటీగా ఏర్పడి ప్రజల సమస్యలు తీర్చేందుకు సమన్వయం చేసుకుందాం. 2019 తర్వాత ప్రజలు అప్పటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అనే ఆవేదనతో 2024లో మనకు గొప్ప విజయాన్ని అందించారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచుకునేలా పనిచేయడం మనముందున్న బాధ్యత. పాలకొండ వెళ్లినప్పుడు అక్కడ పంట పొలాల్లోకి ఏనుగులు చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా తక్కువ నిధులు వెచ్చిస్తే పూర్తయ్యేవి ఉన్నాయి. అలాంటి సమస్యలను వెంటనే తీర్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

ఈ ఎన్నికల్లో విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, సాగు, తాగు నీరు కల్పిస్తామని ప్రజలకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం. దానికి మన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి పని చేయాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రజల భద్రతకు కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయి భరోసా ఉంటుంది. రాజకీయాల్లో కొత్త తరం వచ్చి ఓటు వేసింది. యువతరం మనల్ని బలంగా నమ్మింది. ఎంతో నమ్మకంగా ఓటు వేసిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోతే అంతే బలంగా నిలదీస్తారని గుర్తు పెట్టుకోండి. ప్రజలు కోపంతో ఒక్కోసారి మాట మాట్లాడినా దానిని వేరుగా తీసుకోవద్దు. వారి ఆగ్రహానికి కారణాలు ఏంటో వెతకండి. వాటిని పరిష్కరించేలా పనిచేయండి.

విమర్శలు సహేతుకంగా ఉండాలి
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి. వ్యక్తిగతంగా అసలు మాట్లాడకండి. ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగతంగా మాట్లాడినా.. దానిని మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొందాం. అంతేకానీ ఎదుటివారు మాట్లాడారని ఎట్టి పరిస్థితుల్లో పరిధి దాటి మాట్లాడొద్దు. వ్యక్తిగతంగా అసలు వెళ్లొద్దు. సమయపాలన పూర్తిస్థాయిలో పాటించాలి. ఓ ప్రణాళిక ప్రకారం పాలన ఉండాలి. పార్టీ పరిధి మేరకు కచ్చితంగా పనిచేయాలి. ఏ పాలసీ మీద అయినా అంతా కలిసి ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందాం. ఐదేళ్ల పాలనకు ఓ ప్రణాళిక అనుసరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఎన్డీఏ పక్ష పార్టీలతో స్నేహంగా మెలగాలి. కలుపుగోలుగా క్షేత్రస్థాయిలోనూ అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలి. ఇదే స్ఫూర్తిని ఐదేళ్లు కొనసాగించి ప్రజల మన్ననలు పొందేలా పని చేస్తారని ఆకాంక్షిస్తున్నాను”  అన్నారు.

పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి… రాష్ట్రం కోసం తపించిన విధానం మనల్ని గెలిపించాయి: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “చారిత్రక విజయం అందుకున్న ఈ తరుణంలో మొదటి శాసనసభ పక్ష సమావేశం జరుపుకోవడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి… రాష్ట్రం కోసం తపించిన విధానం మనల్ని గెలిపించాయి. ఇంతటి గొప్ప విజయం అందుకున్న సమయంలో అంతే గర్వంతో అధ్యక్షులవారి నిర్ణయంలో ఆయనకు అండగా నిలబడాలి. ప్రజలు మన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంతే చిత్తశుద్ధిగా పని చేయాలి. ఈ శుభతరుణంలో పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని ఎన్నుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోంది” అన్నారు.