విద్యార్థుల సమస్యలపై మంత్రి సవితమ్మకు లేఖ

◆ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ
◆ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి  లోటుపాట్లపై  ఇంచార్జ్ ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ
◆ హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ పై  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

పెనుకొండ, మహానాడు :  శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి  కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

పాపిరెడ్డి పల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నతాధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ  లేఖలో అవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో సమస్యలు తెలిసినా ఎవరికి చెప్పుకోలేక దీనస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని, ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు 250 మంది విద్యార్థుల పరిస్థితిపై  వివరంగా లేఖలు రాశారు. ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి  సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మీ ఇళ్లలో ఇలాగే వంట చేసి పిల్లలకు వడ్డిస్తారా అంటూ మండిపడ్డారు. సమస్యలపై విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ ఇంచార్జ్  ఎస్ఓ శాలినిదేవి  తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో  ఇంచార్జ్ ఎస్ఓ   హాస్టల్ నుండి బయటకు వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని తెలియజేశారు.

మంత్రి హాస్టల్ లోని  వంటగదిని పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్ తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారా అంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. బాత్ రూమ్ లను పరిశీలించి  శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ శాలిని దేవి  వ్యవహార శైలిపై, ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలిని దేవి పై  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.