– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
పల్నాడు, మహానాడు: రాజధాని అభివృద్ధిలో భాగంగా పల్నాడు జిల్లాలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న పెదకూరపాడు, అమరావతి మండలాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో నియోజకవర్గానికి మౌలిక వసతులు సమకూరుతాయి. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో ఇతర రంగాల పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుంది. నూతన పరిశ్రమల స్థాపనతో నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పారిశ్రామికంగా తీర్చి దిద్ధేలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేలా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు అధికారులు వేగంగా పని చేయాలని కోరుతున్నాం.