నల్లచెరువులో సమస్యల తిష్ట: గళ్ళా మాధవి 

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్ లో ప్రజా సమస్యలు తిష్ట వేసాయని, కనీస మౌలిక సదుపాయాలు రోడ్లు,మంచినీరు,డ్రైనేజి సమస్యలను కూడా గత పాలకులు విస్మరించారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 19వ డివిజన్ నల్లచెరువులో 2వ రోజు నల్లచెరువు “0” లైన్ నుంచి  గళ్ళా మాధవి  పర్యటించారు. ఈ సందర్భంగా  డివిజన్లో తీవ్ర నీటి సమస్య ఉందని, కొన్నిచోట్ల తాగునీటి అవసరాల కోసం చేతి పంపుల మీద ఆధార పడేవారమని, ఇప్పుడు అవి మరుగునపడ్డాయని  కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను వివరణ అడుగగా నిధుల కొరత వలన మరమ్మతులు చేయించలేక పోయామని తెలుపగా, చిన్నపనులకు నిధులను సాకుగా చూడటం ఏమిటని, వెంటనే మరమ్మతులు చేయమని, మున్సిపల్ నీరు కొరత లేకుండా చూడాలని గళ్ళా మాధవి ఆదేశించారు. నల్లచెరువు “0” లైన్ “8” అడ్డరోడ్డు నుంచి  25వ లైన్ వరకు రోడ్లు గోతుల మయంగా మారిందని, అలాగే కాలువల్లో పూడిక కూడా తీయడం లేదని, 6వ లైన్ లో వీధి దీపాల సమస్య ఉన్నదని  ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

గంజాయి కోరల్లో యువత చిక్కుకున్న యువత స్థానిక ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారని ఈ విషయం పై తనకు అధిక ఫిర్యాదులు వస్తున్నాయని “నల్లచెరువు, ఆర్ అగ్రహారం, సంపత్ నగర్, వడ్డె గూడెంలో గంజాయి బ్యాచ్ కు అడ్డాలుగా మారాయని, వర్కర్స్ కాలనీలోని నిర్మాణంలో ఉన్న భవనాన్ని  గంజాయి బ్యాచ్ లు  అడ్డాగా మార్చుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. గంజాయికి అడ్డాగా మారిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు.  పోలీసులు మఫ్టీలో తిరుగుతూ, పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.