Mahanaadu-Logo-PNG-Large

జగదీశ్వర్‌రెడ్డిని ఆధారాలతో నిందితుడిగా నిలబెట్టండి

ఆర్థిక వ్యవస్థపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా?
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రాజెక్టుల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై విచారణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా ఎండగట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వివిధ కంపెనీలు, సంస్థలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో అనేక అక్రమాలు జరిగాయని, ముడుపులు చేతులు మారాయని నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను పునరుద్ఘాటించారు. విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన స్కాంపై నాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు తీవ్రంగా ఆరోపణలు గుప్పించారని, అయితే నేడు అధికారంలోకి వచ్చాక అక్రమార్కులను కాపాడేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మిన్నకుండటాన్ని ఆయన తప్పుబట్టారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై జస్టిస్ నరసింహారెడ్డి సంఘం ఆధ్వర్యంలో విచారణను మరింత పారదర్శకంగా, సమగ్రంగా చేయాలన్నారు.

నాడు ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఆధారాలతో సహా కమిషన్ ఎదుట హాజరుపర్చాలని, సమగ్రమైన విచారణ కోసం మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.

భారత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి అధికారం చేపట్టిన సందర్భంగా గత మూడు రోజులుగా పలువురు కేంద్రమంత్రులను కలిసామని డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ వెల్లడించారు.

నూతన కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లను కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను వివరించామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ, క్రమశిక్షణారహిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పి, పరిస్థితి దయనీయంగా తయారైందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి.. వాటాలు, కోటాలు, గప్పాల కోసం కాంట్రాక్టర్లకు పెండింగ్, అడ్వాన్స్ బిల్లులను చెల్లించి ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయిస్తున్నారు.. గాడితప్పిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా అని డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ సవాల్ విసిరారు. జూన్ 10వ తేదీన ట్యాక్స్ డివల్యూషన్ కింద రాష్ట్రానికి రూ. 2937.58 కోట్ల నిధులను విడుదల చేసినట్లు వివరించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రెండుసార్లు నిధులను విడుదల చేసిందని స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయి దివాళా తీసిందని విమర్శించారు. మరోవైపు అప్పులకు సంబంధించిన విషయంలో ఎఫ్ఆర్ బీఎం గరిష్ట పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మించిపోయిందన్నారు. గత ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికార పార్టీకి సంబంధించిన మంత్రుల కాంట్రాక్టు సంస్థలకే బకాయిలతో పాటు అడ్వాన్సుల రూపంలో ఎక్కువ మొత్తంలో నిధులు చెల్లించి, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తోందంటూ ఆరోపించారు.

రాష్ట్ర మంత్రులు వాటాలు, కోటాల రూపంలో కప్పం చెల్లించడంపైనే దృష్టి పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తులు రోజురోజుకు తరిగిపోతుంటే.. మంత్రుల ఆస్తులు క్రమేణా పెరిగిపోతున్నాయంటూ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు వనరులంటే స్థిరాస్తులను అమ్మడమేనన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఓట్ల కోసం ఒట్లు పెట్టుకుని, పథకాలను అమలు చేస్తామని చెప్పి, ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు.

మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ తో పాటు మిగతా రహదారుల నిర్మాణం విషయంలో భూసేకరణకు సహాయ నిరాకరణ చేస్తోందంటూ మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు మానుకొని, కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసేలా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ చురకలు అంటించారు.