నేటి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

– ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

మచిలీపట్నం, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బందరులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కోరారు. ఈ మేరకు మంత్రి మంగళవారం కృష్ణా జిల్లా అధికారులు, మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం రానున్నారు. నగరంలో పలు చోట్ల ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నం వచ్చిన మంత్రి…. ముందుగా ఆర్ అండ్ బి అతిథి గృహంలో పురపాలక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సీఎంకు వివరించాల్సిన అంశాలపై చర్చించారు. అక్కడి నుంచి నేషనల్ లా కాలేజీలో సీఎం హెలికాప్టర్ కోసం ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ను పరిశీలించారు. అక్కడి నుంచి కళాశాల బయట సీఎం పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలన తర్వాత డంపింగ్ యార్డు ను మంత్రి పరిశీలించారు.

ఆ తర్వాత టీటీడీ కల్యాణ మండపంలో సీఎం పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. ఇక్కడ సీఎం చంద్రబాబు సఫాయి కర్మచారి పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి తర్వాత వారికి దుస్తులు, పారిశుద్ధ్యం కోసం వినియోగించే రక్షణ పరికరాలు అందజేస్తారు. ఆయా ప్రాంతాల పరిశీలన తర్వాత మంత్రి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, మెప్మా ఎండీ తేజ్ భరత్, పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్, ఎస్పీ గంగాధర్ రావు తో పాటు మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.సమీక్ష తర్వాత మంత్రి మీడియాతో ఏమన్నారంటే..

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నారు. నగరంలో సీఎం పలు ప్రాంతాల ను పరిశీలించనున్నారు. ముందుగా హెలికాప్టర్ లో ఉండవల్లి నివాసం నుంచి నేరుగా నేషనల్ లా కాలేజీ లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడే కళాశాల బయట భారీగా విద్యార్దులు తో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని. అక్కడి నుంచి డంపింగ్ యార్డు ను పరిశీలించిన తర్వాత టీటీడీ కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

మచిలీపట్నం కార్పొరేషన్ లో గత టీడీపీ ప్రభుత్వంలో అమృత్ – 1 స్కీం ద్వారా 36 కోట్లతో ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని, అమృత్ 2.0 లో 71 కోట్లతో పనులు చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం తో పనులు ముందుకు సాగలేదన్నారు. 2020 వ సంవత్సరంలో 2290 కోట్ల నిధులను కేంద్రం కేటాయించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 30 శాతం నిధులు ఇవ్వకపోవడం తో కేంద్రం నిధులు మంజూరు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం తో మాట్లాడి నిధులు విడుదల చేయించాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే 6 నెలల్లో అన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. వచ్చే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు అందిస్తాం.

పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాం

రాష్ట్రంలో వరద నీటి కాలువల ఆక్రమణల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. బుడ మేరు ఆక్రమణల తోనే విజయవాడకి భారీ వరదలు వచ్చాయి. అందుకే ఆపరేషన్ బుడమేరు చేపట్టాం.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాల పై ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా, ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించం. అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తాం. ఏ పేదవారిని ఇబ్బంది పెట్టం. అలాంటి వారికి టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపిస్తాం.. పేదల ను సంతృప్తి పరిచిన తర్వాతనే ముందుకెళ్తాం. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాం.