ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల ఆందోళన
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే జీవీ భరోసా
వినుకొండ, మహానాడు: ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలం బుర్రిపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన మేకలు కాసుకునే పేద రైతు కూలీ తాటి శ్రీను (32) కాలికి కురుపు (గడ్డ) రావడంతో శనివారం రవ్వారంలోని ఆర్.ఎం.పి వైద్యులు మల్లికార్జునరెడ్డి వద్దకు వెళ్లగా కాలిపై కురుపును తొలగించి ఇంజక్షన్ చేయడంతో శ్రీను శరీరమంతా దద్దుర్లు, వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీనుని వినుకొండ తరలిస్తుండగా మృతి చెందాడు. దింతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. శ్రీనుని మృతి చెందడం బాధాకరమన్నారు. కాలికి కురుపుతో వెళ్లిన శ్రీనుకు ఆర్.ఎం.పి ప్రాథమిక అందించకుండా, నిబంధనలకు విరుద్ధంగా కురుపు గడ్డ తొలగించడం, ఇంజక్షన్ చేయడం తో వికటించి చనిపోవడం జరిగిందన్నారు. ఆర్.ఎం.పి మల్లికార్జున రెడ్డి అసమర్థ వైద్యంతో పేద రైతు కూలీ ప్రాణం పోయి భార్య, నలుగురు పిల్లలు అనాధలు అవడానికి కారకుడయ్యాడన్నారు. శ్రీను మరణానికి కారకుడైన ఆర్.ఎం.పి మల్లికార్జున రెడ్డిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆర్ఎంపీ పరిధిని దాటి కురుపు గడ్డను తొలగించడం, నొప్పితో బాధపడుతున్న శ్రీనుకి కాలం చెల్లిన ఇంజక్షన్ చేయటం వలన వికటించి చనిపోయాడని, ఆర్.ఎం.పి మల్లికార్జున రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త కొణిజేటి నాగ శ్రీను రాయల్, మండల టిడిపి అధ్యక్షుడు మీసాల మురళీకృష్ణ యాదవ్, టిడిపి నాయకులు గురునాథం, సోమేపల్లి బ్రహ్మయ్య ,రొడ్డ వీరాంజనేయరెడ్డి, గంగినేని బాబు ,గంగినేని ఆంజనేయులు, హలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.