Mahanaadu-Logo-PNG-Large

మార్జాల కిశోర న్యాయం – మర్కట కిశోర న్యాయం

వీటినే తల్లిపట్టు, పిల్లపట్టు అంటారు. ముక్తిని కోరుకునే భక్తులు పాటించాల్సిన రెండు మార్గాలను ఈ రెండు న్యాయాలు వివరిస్తాయి. మార్జాల కిశోరం అంటే పిల్లి పిల్ల. మర్కట కిశోరం అంటే కోతిపిల్ల. ఇవి తెలుస్తూనే ఉన్నాయి.

పిల్లి పిల్లను కన్నప్పటి నుంచి ఆ పిల్ల భారం అంతా తానే వహిస్తుంది. పిల్ల కూడా తన అవసరాల కోసం పూర్తిగా తల్లి మీదే ఆధారపడుతుంది. పిల్లి తన పిల్లను మెడమీద నోటితో పట్టుకుని అన్ని చోట్లకు తీసుకువెళుతుంది.

అదే కోతి అయితే, తన పిల్ల మీద అంత శ్రద్ధ చూపించదు. కోతిపిల్లే పూర్తిగా తన తల్లి పొట్టకింద చేతులతో పట్టుకుని తల్లితో పాటే వెళ్తుంటుంది. అంటే తల్లి మీదే పూర్తిగా ఆధారపడకుండా, తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటుంది.

అదే విధంగా భక్తుల్లో కొందరు పిల్లి పిల్లల్లాగే తమ ముక్తి కోసం పూర్తిగా భగవంతుడి మీదే భారం వేస్తారు. తనదంటూ ఏమీ లేదని, అంతా భగవంతుడిదేనని, ఆయనపై భారంవేసి నిశ్చింతగా ఉండిపోతారు.

అయితే కొందరు భక్తులు మాత్రం గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను అవలంబించి అవిద్యా తెరలను తొలగించుకుని ముక్తిని పొందాలనుకుంటారు. అంటే కోతి పిల్లల్లా తమ ప్రయత్నంతో గట్టెక్కాలనుకుంటారు.

ఈ రెండు మార్గాలు సరైనవేనని పెద్దలు చెప్తారు. ఏ కార్యం సఫలం కావాలన్నా దైవానుగ్రహం, పౌరుషం (మానవ ప్రయత్నం) రెండూ ఉండాలి. అందుకే భగవంతునిపై భారంవేసి, స్వప్రయత్నం విరమించిన వారు కూడా రుచి, త్వర, ఆర్తి కలిగి పరమాత్మను చేరుకోవాలనే తపనపడతారు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

– సువర్చల