కౌంటింగ్ నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూండి సూచనలు
విజయవాడ, హైదరాబాద్, బాపట్లకు రాకపోకలపై ఆంక్షలు
గుంటూరు: జిల్లాలో జూన్ 4 తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లపై ఆదివారం ఎస్పీ తుషార్ డూండి పలు సూచనలు చేశారు. గుంటూరు నగరం నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను ఈ కింద సూచించిన విధంగా మళ్లింపు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు సోమవారం రాత్రి 10 గంటల నుంచి 4వ తేదీన మంగళవారం కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఉంటుందని వివరించారు.
1.బుడంపాడు జంక్షన్: గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు జంక్షన్ వద్ద హైవే దిగి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామూరు`గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లవలెను (ఇరువైపులా).
2.బోయపాలెం జంక్షన్: బాపట్ల వైపు వెళ్లే వాహనాలు బోయపాలెం, ప్రత్తిపాడు మీదుగా బాపట్ల వైపు వెళ్లవలెను. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు హైవే లోనికి అనుమతించబోమని తెలిపారు.
3.హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు: గుంటూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా వెళ్లాలి. విజయవాడ వైపు అనుమతించబడవు.
4.చిలకలూరిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లేందుకు వచ్చే వాహనాలు చిలకలూరిపేట వై జంక్షన్ (గుంటూరు) నుంచి చుట్టుగుంట, పేరేచర్ల మీదుగా వెళ్లవలెను.
5.మంగళగిరి వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాల మళ్లింపు: మంగళగిరి నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు వచ్చే వాహనాలు రేవేంద్ర పాడు జంక్షన్ మీదుగా తెనాలి, బట్టిప్రోలు, పెనుమూడి ఫ్లై ఓవర్ మీదగా విజయవాడ వైపు వెళ్లవలెను.
6.అత్యవసర వాహనాలు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కౌంటింగ్ నిమిత్తం వెళ్లే అన్నీ వాహనాలను ఏ దారి నుంచి అయినా అనుమతించనున్నారు. కనుక గుంటూరు నుంచి ప్రయాణం చేసే వాహనదారులు జూన్ నెల 3న రాత్రి 10 గంటల నుంచి విజయవాడ వైపు వెళ్లే ఎలాంటి వాహనాలకైనా అనుమతులు లేవు. (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్దకు కౌంటింగ్ నిమిత్తం వచ్చే వాహనాలు తప్ప) పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.