– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెల్లడి
దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మెగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తొలి విడత దొనకొండలో అక్టోబర్ ఆరోతేదీన మెగా కంటి శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదే విధంగా ప్రతి నెల మొదటి వారంలో ఐదు మండలాలలో మెగా కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో వెలుగులు నిండుతాయన్నారు. ‘మన మంచి ప్రభుత్వం’లో 100 రోజుల పాలనలో అనేక ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతూనే ఒక డాక్టర్ గా వైద్య శిబిరాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా సంకల్పం అన్నారు.
గతంలో దర్శి పట్టణంలో దాదాపు 5 వేల మందికి వైద్య శిబిరం ద్వారా అనేక వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేసామని, అందులో కొనసాగింపుగానే మరో అడుగు ముందుకు వేసి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మెగా కంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డాక్టర్ లక్ష్మి కోరారు. ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయగలిగామన్నారు. ఇలా దర్శి ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పన, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత, అభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి కార్యక్రమాలతో అభివృద్ధి వైపు అడుగులు వేద్దామన్నారు.