- బాధితులను ఆదుకోవాలని సి ఎం చంద్రబాబు పిలుపు
- తక్షణమే స్పందించిన మేఘా యాజమాన్యం
- హరే కృష్ణ మూవ్ మెంట్ , ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహరం తయారీ
- ప్రభుత్వ యంత్రాగం ద్వారా ఆహార పంపిణీ
విజయవాడ , సెప్టెంబర్ 03: కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న విజయవాడ నగర ప్రజలను తమకు తోచిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎం ఈ ఐ ఎల్ ) యాజమాన్యం స్పందించింది. ప్రతి రోజూ లక్షమందికి తగ్గకుండా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిల్స్ అందించాలని నిర్ణయించి మంగళవారం నుంచి ఆహరం పంపిణీ ప్రారంభించింది. హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎం ఈ ఐ ఎల్ చేపట్టింది. హరే కృష్ణ మూవ్ మెంట్ , ఎం ఈ ఐ ఎల్ వంట శాలల్లో ఆహారాన్ని సిద్ధం చేసి విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో అధికారులకు కంపెనీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయ ఇంచార్జి కొమ్మారెడ్డి బాపి రెడ్డి మంగళవారం అందచేశారు. బాధితులకు అవసరమైన ప్రాంతాల్లో ఆహారాన్ని ప్రభుత్వ అధికారులు పంపిణీ చేశారు. ఇందుకు అవసరమైన తోడ్పాటును ఎం ఈ ఐ ఎల్ అందించింది. ప్రకృతి విపత్తులు ఎక్కడ సంభవించినా సామాజిక బాధ్యతగా ఎం ఈ ఐ ఎల్ స్పందిస్తుంది.
ప్రభుత్వాలకు విరాళాలు ఇవ్వటంతో పాటు, ప్రజలకు తక్షణం ఉపసంనం కల్గించే చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సి ఎం చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు తక్షణమే స్పందించింది ఎం ఈ ఐ ఎల్ యాజమాన్యం . దేశంలోని పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్వహణ, క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణం, రోగులు, వారి సహాయకులకు అక్షయపాత్ర పేరుతో ఆహారం పంపిణీని ఎం ఈ ఐ ఎల్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎం ఈ ఐ ఎల్ ఏ పీ ఇంచార్జి కొమ్మారెడ్డి బాపురెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో తమ సంస్థ ఎపుడూ ముందు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు స్పందించి బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. సామాజిక బాధ్యతను నెరవేర్చటంలో తమ సంస్థ ఎపుడూ ముందు ఉంటుందన్నారు. మరికొన్ని రోజులు వరద బాధితులకు తాము ఆహారం అందిస్తామని బాపిరెడ్డి తెలిపారు.