అమృతకాలం కాదిది, ఆపత్కాలం!
(పుస్తక పరిచయం)
రాంపల్లి శశికుమార్ కు పరిచయం అక్కర లేదు. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన శశి, సులభంగా అర్థం కాని ఆర్థిక విషయాలను అరటి పండు ఒలిచినట్టుగా అవగతం చేయించాడు. ఇంతకు ముందు కూడా బడ్జెట్ ప్రతిపాదనల వెనుక ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని బహిర్గతపర్చి, పాలకవర్గాల పథకాలను కనీస అక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పాడు.
మోది కంటే ముందు గానే పెద్ద నోట్లను చలామణి నుంచి తొలగించాల్సిన అవసరం గురించి, అందుకు ముందు చర్యలుగా చేపట్టాల్సిన చర్యలను క్షుణ్ణంగా సూచించాడు. అవేమీ లేకుండా గెరిల్లా చర్యలాగా మోది చేపట్టిన ఆకస్మిక చర్య, వందలాది మంది మరణానికి , దేశ ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయ్యేందుకు , చివరకు నల్లకుబేరులు తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవడానికి దోహదం చేసింది.
రాంపల్లి శశి కుమార్ తన పుస్తకానికి పెట్టిన శీర్షికే మొత్తం పుస్తకంలో విషయాన్ని వాస్తవ వర్ణాలలో వివరించి చెప్పింది.
వస్తువును ఇంతకంటే బలంగా శీర్షికలోనే ప్రతిబింబించడం సాధ్యం కాదేమో. మోది ఆయన మతోన్మాద మూకలు అంటున్నట్టుగా ఇది అమృతకాలం కాదు , ఆపత్కాలం విపత్కాలం. అది ఏదో ఒక్క రంగంలోనో కాదు . సర్వ వ్యాపితంగా భారతదేశం స్థాయి “ఆకాశంబున నుండి శoభుని శిరంబందుండి… హిమాద్రి నుండి” అన్నట్టుగా పడిపోతూనే వున్నది.
మోది చెప్పిన ప్రతి మాట విరుద్ధార్థంలో నిజమైంది, గతకాలంలో వాజపేయి గారి మెరుస్తున్న భారత దేశం (India Shining ) లాగా. ఒక్క మాట మాత్రం మోది వాస్తవం చెప్పాడు, తనది వ్యాపారి మిత్ర ప్రభుత్వమని. తగినట్టుగానే శతకోటీశ్వరుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఈ విషయంలోనే భారతదేశం ఎనలేని అభివృద్ధిని సాధించింది.
జి డి పి (స్థూల జాతీయ ఉత్పత్తి) విషయంలో మన దేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నదని మోదిచెప్తున్నాడు. ఆదెంత మోసపూరితమైన మాటో శశికుమార్ వివరించాడు. ఈ విషయాన్ని వరల్డు ఇనిక్వాలిటీ లాబ్సు వారు సోదాహరణంగా వంద సంవత్సరాలలో ఇటీవలి ముప్ఫై సంవత్సరాలలో , మరీ ప్రత్యేకించి ఈ పది సంవత్సరాలలో సంపద కేంద్రీకరణ పెరిగిపోయిందని , కొద్ది మంది చేతులలో దేశ సంపద, ఆదాయాలు కేంద్రీకృతమైనయని గణాంకాలతో వివరించింది.
గణాంక వివరాలను ఇస్తూ శశి కుమార్ సంపద కేంద్రీకరణే కాకుండా ఆదాయాల కేంద్రీకరణ కూడా ఎలా ఉందో చూపించాడు.
ఒక సర్వే ప్రకారం సగటు భారత గ్రామీణ కార్మికుడు 941 సంవత్సరాలలో సంపాదించే మొత్తాన్ని ఒక పెద్ద కంపనిలో ఉన్నత పదవిలో ఉన్న అధికారి ఒక సంవత్సరంలోనే సంపాదించగలడని చెప్పాడు. దేశంలోని దిగువ 50% జనాభా ఆదాయం దేశ జాతీయాదాయంలో 13% మాత్రమే. ఆదాయ పిరమిడ్ లో ఎగువన ఉన్న 1% సంపద దేశ సంపదలో 41%, ఆ దిగువన ఉన్న 4%వారి సంపద 21%, ఆ దిగువన ఉన్న 5% వారి సంపద 10%, తరువాతి 20% సంపద 18%, ఆ దిగువన ఉన్న 20% వారి సంపద 7%, అట్టడుగు 50% సంపద కేవలం 3% మాత్రమే. అట్టడుగు సగం జనాభా సంపద 3% ఉంటే దేశం ఏమి అభివృద్ధి సాధించినట్టు?
భారతదేశంలో పేదరికం తగ్గి పోయిందని ప్రభుత్వ చాలా ఘనంగా చెప్పుకుంటున్నది. ఈ మాటల్లోని బోలుతనాన్ని కరొన కాలంలో ప్రతి చోటా మరి ముఖ్యంగా రహదారుల వెంట పిల్ల పాపలతో ,రవాణా సౌకర్యాలు లేక వందలేమిటి వేల కిలోమీటర్ల దూరాలను నడుస్తూ వెళ్ళిన వలస కార్మికులు కోట్ల గొంతుకలతో చెవిటి వానికి సైతం వినిపించేలా చెప్పారు. ఇప్పటికీ అస్సాం నించి ,బెంగాల్ నించి ,ఉత్తర ప్రదేశ్ నించి తమిళనాడుకు , కేరళకు , తెలంగాణకు పనుల కోసం తరలి వస్తున్న వలస కార్మికులు, తెలంగాణ నుండి మధ్యప్రాచ్య దేశలకు తరలి వెళ్తున్న వలస కార్మికులు చెప్తూనే ఉన్నారు.
ఈ వాస్తవాలు చూసేందుకు , వినేందుకు కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు , చెవులు లేవా? లేక పోవడమేమిటి , భేషుగా ఉన్నాయి. కళ్ళు , చెవులుగా ఉండాల్సిన ఎన్ ఐ ఏ , ఐ బి, ఆర్ ఏ డబ్ల్యూ , ఈ డి, సి బి ఐ వేరే పనిలో తల మునకలై ఉన్నాయి. ప్రతిపక్షాల భరతం పట్టేందుకు కార్యనిరతమై ఉన్నాయి. ప్రభుత్వానికి తమ పది సంవత్సరాల నిర్వాకం చాలా బాగా తెలుసు, తమ మాయ మాటలతో భారత ప్రజానీకాన్ని మోసపుచ్చలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నాలను శశికుమార్ తన నూటముప్ఫయారు పేజీల పుస్తకంలో తుత్తునియలు చేశాడు.
మోది అవినీతిని అసలే సహించనని ఘీంకరించాడు, కాంగ్రెసు అంటేనే అవినీతి అన్నాడు. ప్రభుత్వంలోకి వచ్చినా తరువాత కాంగ్రెసు అవినీతిని రుజువు చేయలేక పోయాడు. పరిశ్రామాధిపతుల చేయి మెలిపెట్టి , బెదరించి కొనిపించిన ఎలక్టోరల్ బాండ్సును మరి ఏమని పిలవాలి , ఎలక్టోరల్ బాండ్సు కొన్న వ్యాపారస్తులకు వేల కోట్ల రుపాయల కాంట్రాక్టులు ఇవ్వడాన్ని ఎలా శిక్షించాలో ప్రజలకు తెలుసు. తమ తీర్పును రిజర్వు చేసి ఉంచారు. జూన్ రెండవ తారికు నాడు తీర్పు వెలువరిస్తారు.
బి జె పి ప్రభుత్వం వైఫ్యల్యాలు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. ఆన్ని రంగాలకు ఆవరించి , వారు ఇన్ని రోజులు చేసింది దుష్పరిపాలన అని అట్టడుగు మనిషికి అనిపించేలా చేసింది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేయడం మొదలు పెట్టి అంతా దుష్పరిపాలనే. హిందూత్వం తప్పితే వారికి ఏది పట్టదు. నిరంకుశత్వం వైపు ఒక్కొక్క అడుగే వేశారు. అది శ్రుతిమించి రాగాన పడి, మోది ఏకవ్యక్తి నిరంకుశత్వానికి దారి తీస్తున్నది. ఎన్నికల సభలలో మోది మైనారిటీల మీద ,ముఖ్యంగా ముస్లింల పైన నిప్పులు కురిపిస్తున్నాడు.
రాజ్యాంగ ప్రాతిపదిక సూత్రమైన లౌకికవాదాన్ని అవహేళన చేస్తున్నాడు. మరో వైపున సందర్భం లేకపోయినా పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకు కావలసింది కూడు, గుడ్డ, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ప్రశాంత రాజకీయ వాతావరణం. అవి కాకుండా రామాలయం నిర్మించామని చెప్పితే, కొందరు మూర్ఖులు తప్పితే ప్రజలు ఒప్పుకోరు. ఈ పది సంవత్సరాల బి జె పి పాలనలో ప్రజలను కొట్టి , అంబానిలకు, ఆడానిలకు దోచి పెట్టారన్నది అందరికీ తెలిసి పోయింది.
వారి ఆస్తులు 40-50 రెట్లు పెరిగాయి. రోజుకు 350 కూడా సంపాదించలేని వారి సంఖ్య 20-30 కోట్లు కాగా అడాని అంబానిల రోజువారీ ఆదాయం 30 కోట్ల రూపాయలు. అయినా అంధభక్తులు ఒప్పుకోరు. ప్రజలు మరింత పేదలుగా మారిపోయారన్నది కూడా ఒప్పుకోరు. అలాగయితే 80 కోట్లమందికి ఉచిత రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఎవరి ఊరిలో వారికి ఉపాధి ఎందుకు దొరకడం లేదు. పదేళ్ల క్రితం ఉండే ధరలతో పోల్చితే ఇప్పటి ధరలు కనీసం డెబ్భై శాతం పెరిగి పోయాయి. దానికి పెట్రోలు ధరలే సాక్ష్యం చెబుతున్నాయి.
2014 లో 66 రూపాయలుగా ఉన్న పెట్రోలు ఇవ్వాళ 110 రూపాయలు. ఇంధనం ధర పెరిగితే అన్నిటి ధరలు పెరుగుతాయన్నది కనీస ఇంగితం. రైతులు కనీస మద్దత్తు ధరను శాసనబద్ధం చేయమని ఏడాది పాటు తీవ్రమైన పోరాటం చేసిన విషయం భారత దేశ ప్రజలు మరిచిపోలేదు . నిరుద్యోగం నలభై ఏళ్ల రికార్డు స్థాయిని తాకింది. గణాంకాలను పక్కన బెట్టినా , దేశంలోనే అంతర్గత వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో కోవిడ్ ప్రత్యక్షంగా చూపించింది.
భారతదేశపు సమాఖ్య స్వరూపాన్ని సైతం మార్చి వేయాలన్న దృష్టితోనే చట్టాలు తెస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే పాలిసీ దానిలో భాగమే. కాంగ్రెసు కూడా సమాఖ్య స్వరూపాన్ని దెబ్బ తీసే విధంగానే వ్యవహరించింది. సర్కారియా కమిషన్ సమాఖ్య స్వరూపాన్ని సంరక్షించే సిఫారసులను సూచించింది. కానీ ఎవరూ వాటిని అమలు చేసేందుకు సిద్ధంగా లేరు.
మేక్ ఇన్ ఇండియా కుప్పకూలి పోయింది. చైనా లో పెట్టుబడులు మన దేశానికి తరలి వస్తాయని గోతికాడి నక్కలాగా ఎంత ఎదురు చూసినా పెట్టుబడులు తరలి రాలేదు. విదేశీ పరిజ్ఞానంతో, భారతదేశంలో చవకగా లభించే శ్రమతో ఉత్పత్తులు చేసి దాన్నే ఆత్మనిర్భరత అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా మనదని చెప్పుకోగలిగిన ఉత్పత్తి ఒకటి కూడా లేదంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది. ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులు, సాఫ్టు వేర్ ఉత్పత్తులు, విదేశాల్లో పని చేసే కార్మికులు చేసే చెల్లింపులే మన ప్రధాన విదేశీ మారక ద్రవ్య ఆర్జన మార్గాలు.
ఉత్తర భారత దేశంలో గ్రామీణ యువకులకు ప్రధాన ఉపాధి వనరుగా ఉండే సైనిక దళాల రిక్రూట్మెంటును సైతం అగ్నివీర్ పథకం కింద తీసివేసింది మోది ప్రభుత్వం. 2014 లో హామీ ఇచ్చిన ఏటా 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, ఎవరికి ఇచ్చారో తెలియదు. దేశం మొత్తం మీద అరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోలేదు.
అన్ని రంగాలలో ఎదురైన వైఫ్యల్యాలను రామ మందిర నిర్మాణంతో, హిందూ రాష్ట్ర నిర్మాణంతో కప్పి పుచ్చుకోవాలనుకుంటున్న మోదికి నూటనలభై కోట్ల భారత ప్రజలు గట్టి గుణపథం నేర్పుతారు. లక్షలాది తప్పులను చేస్తూ బుకాయిస్తున్న ఆధునిక శిశుపాలుని నిరంకుశత్వాన్ని ఖండిస్తారు.
– డాక్టర్ రవీంద్రనాథ్ సూరి