6 బస్సులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి

– డిపోకు లాభాలు వచ్చేలా అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలి
– స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన

వినుకొండ, మహానాడు: ఆర్టీసీ డిపోకు కొత్తగా కేటాయించిన రెండు ఇంద్ర ఏసీ బస్సులు, నాలుగు ఎక్స్‌ ప్రెస్‌ బస్సు సర్వీసులను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలను నాటారు. వినుకొండ ఆర్టీసీ డిపో ను ₹15 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో సువిశాలమైన ప్రాంగణంలో మోడ్రన్ బస్ స్టాండ్ ఏర్పాటు కు ప్రణాళికలు సిద్ధం చేసి నవీకరీంచనున్నామని రవాణాశాఖ మంత్రి తెలిపారు. వినుకొండలో స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆంజనేయులు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని, విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొచ్చారని, జగన్ మోహన్ రెడ్డి బూడిద తప్ప ఏమీ తేవడం చేతకాదని ఎద్దేవా చేశారు. వినుకొండ డిపోకు లాభాలు వచ్చేలా అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు, యూనియన్ల నాయకులు పలు సమస్యలను మంత్రి దష్టికి తీసుకువచ్చారు.

ఆర్టీసీ గ్యారేజ్‌, బస్టాండ్‌ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న, సమస్యలన్నీ సంబంధిత మంత్రి దృష్టిలో ఉంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడం రమేష్, టీడీపీ నాయకులు శమీమ్ ఖాన్ , పీ.వి.సురేష్ బాబు, పత్తి పూర్ణచంద్రరావు, అయిబీ ఖాన్, సౌధగర్ జానీ భాష,చికెన్ బాబు, గంధం కోటేశ్వరరావు, డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, ఈడీ వేంకటేశ్వరరావు, రవాణా అధికారులు ఉన్నారు.