అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం

మంగళగిరి, మహానాడు: రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారిణికి రూ.3 లక్షలు అందజేశారు. మాల్టా దేశంలోని జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత దేశం నుంచి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన సాదియా అల్మాస్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ ను పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కలిశారు.

చాంపియన్ షిప్ లో పాల్గొనడానికి ఆర్థిక సాయంచేయాలని అల్మాస్ కోరారు. యూరప్ ఖండంలోని మాల్టాదేశంలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. తమకు అంత ఆర్థిక స్థోమత లేదని ఆమె తెలిపారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేలా కృషి చేయాలని, చాంపియన్ షిప్ లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. వెంటనే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ.3 లక్షలను స్థానిక నాయకుల ద్వారా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు అందజేయించారు. అడిగిన వెంటనే సోదరుడిలా ప్రోత్సహిస్తూ రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారా లోకేష్ కు సాదియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడారు. సాదియా చదువుతూనే పవర్ లిఫ్టింగ్‌లో ప్రపంచ స్థాయిలో రాణించడం గొప్ప విషయమన్నారు. మాల్టా దేశంలో ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరిగే వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ పోటీలలో సాదియా పాల్గొనడం మంగళగిరి ప్రజలకు గర్వకారణమని అన్నారు.

గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సాదియా ప్రపంచ వ్యాప్తంగా అనేక పోటీలలో పాల్గొని మంగళగిరికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మంగళగిరి, తాడేపల్లిలో రెండు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కరరావు, సాదియా తండ్రి ఎస్.కె సందాని తదితరులు పాల్గొన్నారు.