జోగి రమేష్ బంధువులమంటూ జేసీబీ స్వాధీనం

– ఉద్యోగం పేరుతో మోసం… విచారించి న్యాయం చేయండి
– మంత్రి నారా లోకేష్ 39వ రోజు ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు
– అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ మంత్రి భరోసా

అమరావతి, మహానాడు: ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చిన ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 39వ రోజు ‘ప్రజాదర్బార్’ కు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
– దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి పెన్షన్ అందించి ఆదుకోవాలని తాడేపల్లి మహానాడుకు చెందిన జి.రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
– రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండుకాళ్లూ పొగొట్టుకున్న తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన వలవీటి ఉష కోరారు.
– చేనేత కార్మికుడినైన తాను మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నానని, అయితే ఇటీవల సంభవించిన వరదలకు మగ్గం దెబ్బతిని నష్టపోయానని మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన ఎమ్.వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం రూ.25వేల సాయం అందించిందని, అయితే తనది స్టాండ్ మగ్గం కావడంతో పరిహారం అందలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విచారించి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
– ఉద్యోగం పేరుతో లక్ష వసూలు చేసి మోసం చేసిన కురగంటి జాన్ పై తగిన చర్యలు తీసుకోవాలని తాడేపల్లికి చెందిన జ్యోతుల మహేష్ బాబు ఫిర్యాదు చేశారు. నగదు తిరిగి చెల్లించకపోగా భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పి అద్దె ప్రాతిపదికన తాను ఇచ్చిన జేసీబీని వైసీపీ నేతలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు అద్దె కూడా ఎగ్గొట్టారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లికి చెందిన తలారి రంగారావు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో టాటా హిటాచీ ఎక్స్ కవేటర్ ను అప్పటి జి.కొండూరు వైసీపీ ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, ఎంపీటీసీ వేములకొండ సాంబశివరావుకు అద్దెకు ఇచ్చాను. కొంతకాలం బాగానే అద్దె చెల్లించిన వారు.. అనంతరం అప్పటి మంత్రి జోగి రమేష్ బంధువులమంటూ బెదిరించడంతో పాటు కులం పేరుతో ధూషించి ఎక్స్ కవేటర్ ను మా నుంచి బలవంతంగా గుంజుకున్నారు. వీరి దురాగతాలు భరించలేక ప్రాణభయంతో ఇల్లు వదిలి పోరిపోయాం. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంగళగిరి బైపాస్ వద్ద తాను కొనుగోలు చేసిన 380 చదరపు గజాల స్థలాన్ని నకిలీ దస్తావేజులు సృష్టించి స్థానికంగా ఉండే మాజీ కౌన్సిలర్ పి.శివ శంకర్, పోకూరి కమలాకర్, కలకోటి వంశీ కబ్జా చేశారని గుంటూరు భారత్ పేటకు చెందిన ఎమ్.వెంకట వీరాజి మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. విచారించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని అగరు కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు తమ కులాన్ని బీసీ-డి నుంచి బీసీ-బికి మార్చాలని ఉత్తరాంధ్ర అగరు కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మూడు జిల్లాల్లో అగరు కులస్థులు ఉన్నారని, దశాబ్దాలుగా ఎన్నోవిధాల వెనుకబడిన తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.

క్యానర్స్ వ్యాధితో బాధపడుతున్న తనకు వైద్యం సాయం అందించి ఆదుకోవాలని గుంటూరు అహ్మద్ నగర్ కు చెందిన షేక్ షబీరా విజ్ఞప్తి చేశారు.

వైసీపీ పాలనలో నిలిపేసిన దివ్యాంగ పెన్షన్ ను తిరిగి పునరుద్ధరించాలని నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన డి.శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. వినతులు, ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.