Mahanaadu-Logo-PNG-Large

ఖరీఫ్‌ కార్యాచరణపై మంత్రి తుమ్మల సమీక్ష

పంటల బీమాపై అధికారులకు దిశానిర్దేశం
పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి
పచ్చిరొట్ట విత్తనాల సరఫరాపై ఆదేశాలు
మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు పూర్తిచేయాలి
సహకార సంఘాల ఎన్నికలకు సూచనలు

హైదరాబాద్‌, మహానాడు : ఖరీఫ్‌ కార్యాచరణ, రుణమాఫీ విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అధికారులతో చర్చించారు. రుణమాఫీ పథకం విధివిధానా లపై అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌ 2024 నుంచి అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై దిశా నిర్ధేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలు ఒకటికి రెండు సార్లు పరిశీలించి రైతులు పంటనష్టపోయిన సందర్భంలో ఆదుకునే విధంగా ఉండాలని సూచించారు. పథకం అమలుకు ఆదర్శ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సమావేశాలు నిర్వహిం చి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. మొదటి విడత పంట నష్టపరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండో విడత ఏప్రిల్‌, మూడో విడత మేలో జరిగిన పంట నష్టం వివరాలు సమర్పించాలని సూచించారు.

పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీపై ఆదేశాలు

పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధివిధానాలను రూపొందించి వెంటనే సరఫరా ప్రారంభించాలని, సరఫరాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని తెలంగా ణ సీడ్స్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మట్టి నమూనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం అనుసరించి వెంటనే రైతుల విజ్ఞప్తి మేరకు అవసరమున్న రైతుల పొలాల మట్టి నమూనాలు సేకరించి ఫలితాలు వచ్చే నెలాఖరులోగా అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పించడం, అప్పటికీ వినకపోతే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ వరి కయ్యలు తగలబెడితే జరిమానాలు విధించాలని ఆదేశించారు.

మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేయాలి

మార్క్‌ ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలిపారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేటాయించి న భూములలో ఆధునిక సాంకేతికతతో పండ్ల తోటల పెంపు, నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌ ఫాం కంపెనీల పనితీరు ఆధారంగా మల్బరి సాగు కు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టాల న్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్‌ గ్రాంటు బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చివరగా అన్ని రకాల సహకార సంఘాలలో సభ్యుల గుర్తింపు, పదవీకాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.