గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి వరసగా రెండో రోజూ సిటీలో పర్యటించారు. తాజాగా 18వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి పారిశుద్యం పై దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన గంటల్లోనే అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం కూడా 18వ డివిజన్ లోని మిగిలిన ప్రాంతాలైన రామ నామక్షేత్రం, 7 గొందుల వీధి, మొహిద్దీన్ పాలెం, శ్రీనివాసరావు పేట 5, 6వ లైన్ లలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. 7 గొందుల వీధి, మొహిద్దీన్ పాలెం,శ్రీనివాస్ రావు పేట లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ప్రతి చోట డ్రైనేజి సమస్యలే అధికంగా ఉన్నాయని, అధికారులు వెంటనే ప్రతి చోట డ్రైనేజి సమస్యలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా మొహిద్దీన్ పాలెం మహిళలు తమకు మంచినీటి సమస్య ఉందని 2 రోజులకు ఒక్కసారి మాత్రమే నీటిని వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేయగా, నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతాల్లో కూడా మంచి నీటి సమస్య ఏమిటని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్మయం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక అధికారులు తెలుగుదేశం పార్టీ, జనసేన,బీజేపీ నేతలు ఉన్నారు.