అమరావతి, మహానాడు: అమరావతి మండలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టారు. అమరావతి గ్రామంలోని పలు కాలనీలు, నరుకుళ్లపాడు, యండ్రాయి గ్రామాల్లో పలు ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు నేను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేలా కూటమి నాయకులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. భారీ వరద నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, వరద నీటిలో చిక్కుకున్నా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బాధితులకు తెలిపారు.