నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు: ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు హెచ్చరించారు. ఈ మేరకు రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు మంచినీటి ట్యాంక్ అభివృద్ది పనుల శంఖుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నల్లగార్లపాడు గ్రామంలో పర్యటించారు.
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి చెరువును పరిశీలించారు. మంచినీటి చెరువులో తూటుకాడ విపరీతంగా పెరిగిపోవడం, మంచినీటి చెరువును ఆక్రమించి షెడ్లు నిర్మించుకొని పశువుల కొట్టాలుగా ఉపయోగించుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావుకు వివరించి ఆక్రమణలను చూస్తూ ఊరుకోవడంపై మండిపడ్డారు.తక్షణమే మంచినీటి చెరువును ఆక్రమించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని మంచినీటి చెరువును కాపాడాలన్నారు. మూడు గ్రామాల ప్రజలు తాగునీటి కోసం వినియోగించే చెరువు అభివృద్ది పనులలో నాణ్యతాలోపం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
డంపింగ్ యార్డులో వేయాల్సిన చెత్తను స్మశానవాటికలో వేయడమేంటని అధికారులను ప్రశ్నించారు. తక్షణమే స్మశానాన్ని శుభ్రపరచి డంపింగ్ యార్డులో మాత్రమే చెత్తను పోయించాలన్నారు. అనంతరం మంచినీటి ట్యాంకులలో నీరు పూర్తిగా కలుషితమై ఉండడాన్ని ప్రశ్నించారు. మంచినీటి పై పాచిపేరుకు పోయిందని, తక్షణమే బాగు చేయించాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అనంతరం జరిగిన సమావేశంలో గ్రామాభివృద్ది పై గ్రామస్తులంతా దృష్టి సారించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షిత మంచినీరు అందించడంలో విఫలమైందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, గ్రామాభివృద్ధికి అండగా ఉంటానని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ హామీ ఇచ్చారు.