వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించి రాజీకి యత్నం!

• ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు అరాచకం
• అమరావతిలో పొలం ఉందంటూ భారీ టోకరా!
• భూముల కబ్జాపై పోటెత్తిన భూ బాధితులు

మంగళగిరి, మహానాడు: అల్లూరి జిల్లా రంపచోడవరం, నియోజకవర్గం కూనవరం మండలంలో శాఖా నాగూ అనే వ్యక్తిపై వైసీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారని.. ఒళ్లంతా సగానికిపైగా కాలిపోయినా 18 శాతమే కాలినట్టు డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం స్థానిక పోలీసులు కూడా చిన్న కేసు పెట్టి చేతులు దులుపుకొని రాజీకి యత్నించడం వెనుక ఎమ్మెల్సీ అనంతబాబు హస్తం ఉందని కూనవరం టీడీపీ నేతలు బరపాటి ప్రకాశరావు, చెలికాని ఉమా తదితరులు ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వారు, చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితుడు నాగూకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. నేతలు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నరసింహ ప్రసాద్ లకు వారితోపాటు పలువురు వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించారు.

• సింగరాజు పవన్ కుమార్ అనే అతను తనకు అమరావతిలో 25 ఎకరాల పొలం ఉందని అందులో కొంత పొలం ఇస్తానని చెప్పి తమ వద్ద నుండి రూ. 1,70,00,000 లు తీసుకుని మోసం చేశాడని..40 మంది అతని చేతిలో మోసపోయారని.. అతని, అతని పాట్నర్స్ ఆస్తులను సీజ్ చేసి తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని టి. లలిత్ కుమార్ అనే వ్యక్తి వేడుకున్నారు.
• ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, మైసన్నగూడెంలో సర్వే నెంబర్ 158 లో కబ్జా అయిన 4 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కార్యకర్త నుండి విడిపించి అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలని ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• ప్రకాశం జిల్లా, చీమకుర్తి పట్టణానికి చెందిన ముప్పరాజు విజయశేఖర్ విజ్ఞప్తి చేస్తూ.. పామూరు మండలంలో తాము కొనుగోలు చేసి రిజిస్ట్రర్ చేసుకున్న భూములపై అబ్బూరి శేషయ్య, దావా హరికృష్ణల కన్నుపడి.. గత ప్రభుత్వంలో ఫోర్జరీ పాసుపుస్తకాలు పుట్టించి టైటిల్ డీడ్స్ సృష్టించి రికార్డుల్లో తమ పేర్లను తొలగించి కాజేసేందకు యత్నించగా.. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారికి శిక్షపడిందని.. మళ్లీ వారు ఆ ఫోర్జరీ డాక్యూమెంట్ లతో భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని నేతలకు ఫిర్యాదు చేశారు.
• ఒకప్పుడు ఆదర్శ గ్రామమైన తమ గ్రామంలో నేడు ప్రజలు మంచినీరు లేక అల్లాడుతున్నారని.. ఎంత పెద్ద వర్షం పడినా చెరువులోకి నీళ్లు రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని.. గతంలో చిన్న వర్షం పడితే నిండే చెరువుకు వెలుగొండ ప్రాజెక్ట్ లో భాగంగా తీసిన కాలువ నీరు రాకుండా అడ్డుగా ఉండటంతో ఈసమస్య నెలకొందని.. వర్షాలు పడితే చెరువులోకి నీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుని గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఉన్న బడి స్థలం పూర్తిగా కబ్జాకు గురైందని. 7ఎకరాలపైన ఉన్న స్థలం నేడు ఎకరా రెండెకరాలలోపు కుచించుకుపోయిందని దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన గుండపునేని వెంకటనారాయణ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• కడప జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన బాధితులకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని.. వారి అనుకూలమైన వారికి మాత్రమే పరిహారం ఇచ్చి టీడీపీ సానుకూలపరులకు అన్యాయం చేసిందని దయ చేసి బాధితులకు R&R ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని టీడీపీ ఫార్మర్ ఎక్జీక్యూటీవ్ సెక్రటరీ ప్రకాశ్ రెడ్డి నేతలకు విన్నవించారు.
• గుడ్లవల్లేరు మండలానికి చెందిన అనంత విజయలక్ష్మీ విజ్ఞప్తి చేస్తూ.. పెడన మండలం చెన్నూరు గ్రామ పరిధిలో ఉన్న తమ భూమిని చెన్నూరు గ్రామనివాసులు అయిన గోళ్ల గాంధీ అతని కుమారులు సుబ్రహ్మణ్యం, గోవిందు కౌలుకు తీసుకుని.. కౌలు ఇవ్వకుండా అక్రమంగా మచిలీపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీసులో పార్టీషన్ దస్తావేజులు పుట్టించి దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోమంటున్నారని తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
• గత మూడేళ్ళ నుండి పాసుపుస్తకం కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి. కొత్తకోట గ్రామానికి చెందిన టి. మునిలక్ష్మమ్మ గ్రీవెన్స్ లో నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం వలనే తాను గ్రీవెన్స్ వచ్చి అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తున్నానని ఆమె నేతల ముందు మొరపెట్టుకున్నారు.
• రాష్ట్రంలో టైలరింగ్ రంగం రోజు రోజుకు దీన స్థితికి చేరుకుంటుందని టైలరింగ్ వృత్తిమీద ఆధారపడిన వాళ్లకు సరైన పని దొరకక అనేక ఇబ్బంది పడుతున్నారని.. బడుల్లో విద్యార్థులకు బుక్స్ బ్యాగులు, షూస్ తో పాటు సరిపడా యూనిఫామ్ క్లాత్ ను పిల్లలకు ఇస్తే స్థానిక టైలర్స్ కు ఉపాధి దొరుకుతుందని టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి విజ్ఞప్తి చేశారు.
• 2019 సంవత్సరం నుండి 2024 వరకు ఏపీఎండీసీ సంస్థ వద్ద జరిగిన అవినీతి పై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులైన వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ల పైన, ఏపీఎండీసీ అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని వారు ఆస్తులను జప్తు చేసి సంస్థకు ఇవ్వవలసిందిగా ఏపీఎండీసీ మంగంపేట అవుట్ సోర్సింగ్ & ట్రైనీ కార్మిక పోరాట కమిటీ వారు గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• ఏపీఎండీసీ కార్పొరేషన్ అభివృద్ధికోసం అయ్యపురెడ్డిపల్లెలో పలువురి కుటుంబాల ఇళ్లను తొలగించి సుమారు 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఇంటి స్థలాలు ఇవ్వలేదని తమకు ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించి ఇవ్వాలని అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండలానికి చెందిన అయ్యపురెడ్డిపల్లె నిర్వాసితులు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న తమను గత ప్రభుత్వం విధుల నుండి అక్రమంగా తొలగించిందని.. తమకు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వలేదని దీనిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తమకు న్యాయం చేయాలని పలువురు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టెక్నికల్ బోటు సిబ్బంది గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

భూ కబ్జాలతో పాటు విజయవాడ కు చెందిన పలువురు వరద బాధితులకు పరిహారం అందలేదని వారి పేర్లు నమోదు చేయలేదని పరిహారం అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అలాగే పంటనష్టం పరిహారం అందలేని మరికొందరు వినతులు ఇచ్చారు. విశాఖ జిల్లా కంచర్లపాలెం కు చెందిన మళ్లీ సాయికి పుట్టుకతోనే అంధత్వం ఉందని పింఛన్ కోసం అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆదోని కార్వన్ పేటకు చెందిన బంగి గణేష్ గుండె సమస్యతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్ సాయాన్ని కోరారు. తన తమ్ముడి అకాల మరణంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కడప నగరానికి చెందిన మునిలక్ష్మమ్మ కారుణ్య నియామకం కోరుతూ అర్జీ ఇచ్చారు. పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.