రేపిస్టు ప్రజ్వల్‌ రేవణ్ణకు మోదీ ప్రచారం

మహిళలను అగౌరవపరిచి ఇప్పుడు బేటీ పడావో అంటున్నారు
రేవంత్‌పై ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలి
లేకుంటే తెలంగాణ తడాఖా చూపిస్తాం
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

ఖమ్మం/హైదరాబాద్‌, మహానాడు : ఇటీవల సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను గెలిపించాలని మోదీ ప్రచారం చేశారని, మహిళలను అగౌరవపరచడం బీజేపీకి కొత్త కాదని కాంగ్రెస్‌ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోయిన విషయం, ఆయన తండ్రి మీద కేసు నమోదై జైలుకు పోయిన తర్వాత కూడా అవి ఇప్పటి వీడియోలు కావని దబాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వీడియోలు కాకపోతే తప్పుకాదా? సంఘ విద్రోహులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఎందుకు ఎన్నికల కమిషన్‌ మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఇప్పుడు బేటీ పడావో అంటున్నారు. పార్లమెంట్‌లో నన్ను, సోనియా గాంధీని మహిళలు అని చూడ కుండా అగౌరవ పరిచారు. రోజురోజుకు ప్రజ్వల్‌ రేవణ్ణ…రావణ లాగే ప్రవర్తించాడని అంటున్నారు. ఆరేళ్లుగా వాళ్ల ఇంట్లో పనిచేస్తున్న మహిళను రేప్‌ చేశారు అని బాధితురాలు బయటకు వచ్చి చెప్పింది. వాస్తవాలు బయటకు వస్తున్నాయి. హసన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఒక మహిళను రేప్‌ చేస్తూ వీడియోలు తీసి అనేక మార్లు బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. బ్రిజ్‌ భూషణ్‌ కొడుకుకు టికెట్‌ ఇచ్చారు. ఒక మంత్రి కొడుకు రైతుల మీదకు బండి ఎక్కించినా పక్కన పెట్టలేదని ధ్వజమెత్తారు.

కేసులు వెనక్కు తీసుకోకుంటే తడాఖా చూపిస్తాం

ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి పెట్టిన కేసులు విత్‌ డ్రా చేసుకోవాలి. ఏ హక్కుతో వారు తెలంగాణ వచ్చారు. కేసులు వెనక్కు తీసుకోకుంటే తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. చట్టానికి విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తాం. దొంగ సర్టిఫికెట్లతో పార్లమెంట్‌కు వచ్చినట్లు కాదు. చరిత్ర తెలిసిన వాళ్లు ఇలా ప్రవర్తించారు. మొదటి, రెండు ఫేజ్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోతున్నామని అర్థమైంది. అందుకే మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

గల్ఫ్‌ కార్మికుల ద్రోహి అరవింద్‌

బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌పై ఎంపీ రేణుకాచౌదరి చార్జిషీట్‌ విడుదల చేశారు. గల్ఫ్‌ కార్మికుల ద్రోహి పేరిట ఆయన చేసిన నిర్వాకాలను అందులో వివరించారు.