Mahanaadu-Logo-PNG-Large

జగన్ సర్కారుపై మోదీ జంగ్

– జగన్‌తో.. మో‘ఢీ’
– లాండ్, శాండ్, మైన్ మాఫియారాజ్ అంటూ ఆరోపణాస్త్రాలు

– వైసీపీ అవినీతిపై విరుచుకుపడిన మోదీ
– అమరావతినే మళ్లీ రాజధాని చేస్తామని హామీ
– రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ఫైర్
– జగన్ సర్కారు అవినీతిపైనే మోదీ అస్త్రాలు
– చంద్రబాబు నిజాయతీపరుడని క్లీన్ సర్టిఫికెట్
– చంద్రబాబునాయుడే సీఎం అని ప్రకటన
– కూటమిలో జోష్ పెంచిన మోదీ ప్రసంగాలు
– మోదీ ప్రసంగాల్లో జగన్ అవినీతే అజెండా
– కూటమిలో తొలగిపోయిన అనుమానాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుమానపు తెరలు తొలగిపోయాయి. జగన్ సర్కారుపై బీజేపీ బంతిపూల యుద్ధం కాదు. భీకర యుద్ధమే ప్రకటించింది. దానికి స్వయంగా ప్రధాని మోదీనే నాయకత్వం వహించారు. బొప్పూడి సభలో జగన్ సర్కారుపై మౌనరాగం ఆలపించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు అనకాపల్లి- రాజమండ్రి సభల్లో జగన్ సర్కారుకు మాటల దాడి చేసి ఝలక్ ఇచ్చారు. ‘ఏపీలో ఉన్నది అవినీతి సర్కారు’ అంటూ రెండు సభల్లోనూ జగన్‌పై రౌద్రరసం ప్రదర్శించారు. వచ్చేది ఎన్టీయే సర్కారే.. సీఎం అయ్యేది చంద్రబాబునాయుడే.. అని విస్పష్టంగా ప్రకటించిన మోదీ… టీడీపీ అధినేత చంద్రబాబు నిజాయతీపరుడైన దార్శనికుడు. అందుకే ఆయనతో కలిశాం అని వ్యాఖ్యానించారు. ప్రధాని తాజా వైఖరి కూటమిలో సమరోత్సాహం నింపింది.

ఇప్పటిదాకా బీజేపీ-వైసీపీ తెరచాటు బంధం కొనసాగుతోందన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ..ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ సర్కారుపై, ప్రధాని నరేంద్రమోదీ చేసిన మాటల దాడి, కూటమిలో కొత్త జోష్ నింపింది. చిలకలూరిపేట బొప్పూడి సభలో.. జగన్ సర్కారును పల్లెత్తు మాట అనని మోదీ వైఖరిపై, కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. ఆ తర్వాత డీజీపీ-సీఎస్-టీటీడీ ఈఓ బదిలీలపై ఈసీ మౌనంపైనా అనుమానం తొంగిచూసింది. జగన్ ఒత్తిడి కారణంగానే ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వలే దన్న చర్చ జరిగింది.

ఈ క్రమంలో బొప్పూడి సభలో మోదీ ఏపీ సీఎం జగన్‌పై, విమర్శలకు దూరంగా ఉండటం సహజంగానే అనుమానాలు పెంచినట్లయింది. తర్వాత ఇంటలిజన్స్ చీఫ్, ఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీలు, కలెక్టర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమయి.. మోదీ వచ్చే ముందు రోజు.. అంటే అమిత్‌షా రాష్ట్రానికి వచ్చిన రోజు, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై వేటు పడేవరకూ వెళ్లింది. దీనితో బీజేపీ-వైసీపీ బంధంపై ఉన్న అనుమానాలు చాలావరకూ తొలగిపోయాయి. కానీ సీఎస్ జవహర్‌రెడ్డిని మాత్రం కొనసాగించడంపై, అసంతృప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అది వేరే కథ.

తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. తాము జగన్‌తో లేమని, టీడీపీ-జనసేనతోనే ఉన్నామన్న సంకేతాలిచ్చేందుకు, అనకాపల్లి-రాజమండ్రి వేదికలను వినియోగించుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. రెండు సభల్లోనూ ఆయన, జగన్ సర్కారును దునుమాడారు. జగన్ జమానాలో ల్యాండ్, శాండ్, మైన్ మాఫియా నడుస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో అభివృద్ధి అడుగంటిపోయిందని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని మండిపడ్డారు.

బొప్పూడి సభలో చంద్రబాబును సీఎంను చేయండి అని స్పష్టంగా చెప్పని మోదీ.. తాజాగా పాల్గొన్న రెండు సభల్లోనూ.. ‘‘చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి’’ అని విస్పష్టంగా ప్రకటించడం ద్వారా, టీడీపీ శ్రేణుల మన సు గెలుచుకున్నారు. ‘‘చంద్రబాబునాయుడు నిజాయితీపరుడు. అందుకే మేం ఆయనతో కలసి నడుస్తున్నాం. ఆయనది అభివృద్ధివాదమైతే.. వైసీపీ ప్రభుత్వానిది అవినీతివాదం’’అని ప్రకటించడం ద్వారా, బీజేపీ నాయకత్వం.. జగన్‌తో లేదన్న సంకేతాలిచ్చినట్లు స్పష్టమయింది.

‘‘ జగన్ సర్కారు అవినీతిలో జెడ్ స్పీడ్‌తో ముందుకువెళుతోంది. వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప ఆర్ధిక నిర్వహణ తెలియదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం నెంబర్ వన్‌లో ఉంటే, జగన్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి బాబు నాయకత్వం అవసరం. జగన్ పాలనలో అభివృద్ధి సున్నా. అవినీతిలో మాత్రం వందశాతం. మద్యం సిండికేట్లుగా మారారు. మేం మళ్లీ అమరావతిని రాజధానిగా చేసేందుకే టీడీపీతో జతకట్టాం’’ అని స్పష్టం చేయడం ద్వారా, కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని రైతుల మనసు గెలుచుకున్నారు. అయితే కాంగ్రెస్-వైసీపీ రెండూ ఒకటేనంటూ, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో కనీస బలం లేని కాంగ్రెస్‌పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నది కూటమి నేతల అభిప్రాయం.

అయితే.. ఏపీ సీఎం జగన్‌పై మోదీ కఠిన వైఖరి ప్రదర్శించడానికి, బలమైన కారణాలు లేకపోలేదు. రఘురామకృష్ణంరాజుకు జగన్ ఒత్తిళ్లతోనే ఎంపీ సీటు ఇవ్వలేదని.. డీజీపీ-సీఎస్ బదిలీలపై నత్తనడక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాసినా పట్టించుకోకుండా, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించిన అంశాలపై, కూటమిలోని టీడీపీ-జనసేన శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయన్న విషయాన్ని, రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్‌జీకి స్పష్టం చేసినట్లు సమాచారం.

అంతకుముందు బొప్పూడిలో ప్రధాని మోదీ కూడా, జగన్ సర్కారుపై విమర్శలు చేయకపోవడంపై నాటుకున్న అసంతృప్తిని రాష్ట్ర బీజేపీ నేతలు సంతోష్‌జీకి నివేదించారు. ఈ పరిణామాలన్నీ, బీజేపీ అసెంబ్లీ-లోక్‌సభ అభ్యర్ధుల విజయంపై ప్రభావితం చేస్తాయని.. అవి టీడీపీ-జనసేన ఓట్లు, బీజేపీ అభ్యర్ధులకు బదిలీ కాకపోవడానికి కారణమవుతాయని రాష్ట్ర బీజేపీ నేతలు సంతోష్‌జీకి వివరించారు. దాని ఫలితమే మోదీ తాజా వ్యాఖ్యలని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

‘ ప్రధాని మోదీ సహా రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులంతా, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని మీ మీడియాలో విమర్శిస్తున్నారు. దానికి తోడు డీజీపీ-సీఎస్ బదిలీలు కూడా లే టయ్యాయి. టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి వద్దన్నా డెప్యుటేషన్ పొడిగించారు. దీనిపై మీ మీడియా రాసిన కథనాలన్నీ, మేం ఎప్పటికప్పుడు పైకి పంపించాం. అంతకుమించి మేమేం చేయలేం. మా పనిచేశాం. ఇప్పుడు వాళ్ల పని వాళ్లు చేసినట్లు అర్ధమయింది. మా పార్టీ మీరనుకుంటున్నట్లు, మీరు కోరుకుంటున్నట్లు వెంటనే నిర్ణయాలు తీసుకోదు. ఎప్పుడు అవసరమో అప్పుడే తీసుకుంటుంది’ అని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.

మొత్తంగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన ప్రసంగం, బీజేపీ-వైసీపీ ఒకటి కాదని.. మోదీ ఏపీ సీఎం జగన్‌తో లేరన్న విషయాన్ని స్పష్టం చేసినట్టయింది. ఇది ఇప్పటివరకూ.. ఇష్టం లేని కాపురం చేస్తున్న, టీడీపీ-జనసేన శ్రేణుల అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఉపయోగపడింది. ప్రధానంగా మోదీ సభలు.. రాజమండ్రి-అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధులతోపాటు, టీడీపీ-జనసేన అసెంబ్లీ అభ్యర్ధుల విజయానికి, టానిక్‌లా పనిచేశాయన్న భావన కూటమిలో స్పష్టంగా కనిపించింది.