Mahanaadu-Logo-PNG-Large

‘మట్టి’ నుండి మనీ తవ్వుతున్నారు!

  • దివిసీమలో మట్టి గ్యాంగ్
  • చిరువోలులంక రెవెన్యూ పరిధిలో
  • ఎక్కడా తగ్గేదే లే.. గట్టి డాన్లు గురూ
  • అడ్డగోలు మట్టి తవ్వకాలు
  • మంత్రి కొల్లు, ఎమ్మెల్యే మండలి ఎక్కడ?

అవనిగడ్డ: మట్టిబాబులంటే గట్టి బాబులే… అర్ధరాత్రే కాదు.. పట్టపగలూ మట్టిని కొల్లగొట్టగలరు. ఎమ్మెల్యే అంటే లెక్కలేదు. మంత్రిని పట్టించుకోరు. ఇక కలెక్టర్ అయితే ఏంటీ? ఆర్డీవో ఊహూ.. తాహసీల్దార్ మనోడే. వీఆర్వో మన గ్రామసింహమే. ఇదీ మట్టి మాఫియా బాష.

అందుకేనేమో.. గాంధేయవాది మండలి బుద్ధ ప్రసాద్ సామరస్య హెచ్చరికల్ని పట్టించుకోవటం లేదు. ఇక మంత్రి కొల్లు రవీంద్రకు టైమ్ లేదు. ఆఫీసర్లా.. అటు వెళ్లరు. ఇంటి గుమ్మంలోనే సంచి వాలిపోతుంది. ఇదీ జనం భావన. అందుకే మోపిదేవి మండల పరిధిలోని ఉత్తర చిరువోలులంక రెవెన్యూ పరిధిలో శనివారం మధ్యాహ్నం నుంచి మట్టి తవ్వకాలు మొదలయ్యాయి. ఇక్కడ మట్టి డాన్ అడ్డగోలుగా మట్టి తవ్వేస్తున్నారు. కడకు కాలువ గట్టునూ తెంచి లారీల్లో తోలేస్తున్నాడు.

ఎమ్మెల్యే ఘోష.. అరణ్య రోధనే

అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తాను గెలిచిన నాటి నుంచి ప్రతి సమావేశంలో నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుని ఆదేశాలు బేఖాతరు చేస్తూ, మోపిదేవి మండలంలో రెవెన్యూ అధికారులు అక్రమ మట్టి తవ్వకాలను ప్రోత్సహిస్తున్నార నడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.

గ్రామాలలో జరిగే చట్ట విరుద్ధ పనులకు పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో లు బాధ్యత వహించాలని మోపిదేవి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ అధికారులకు సూచించారు. కానీ చర్యలు లేకపోవటంతో.. బుద్ధ ప్రసాద్ ను జనం అనుమానించక తప్పటం లేదని జనం వాపోతున్నారు. ఇంతకీ రెవెన్యూ అధికారులు ఏ నోట్ల కట్టలను తమ కళ్లకు గంతలుగా వాడుతున్నారనే ఆరోపణలు ఇక భరించక తప్పదు.