Mahanaadu-Logo-PNG-Large

ముస్లింల మద్దతు తెలుగుదేశం పార్టీకే

టీడీపీ పాలనలోనే ముస్లింలకు రక్షణ
చంద్రబాబును సీఎంను చేసే బాధ్యత ప్రతి ముస్లింపై ఉంది
జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ తీర్మానం

అమరావతి, మహానాడు : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఉండవెల్లిలోని ఆయన నివాసంలో జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్‌ ఖాసిమి కలిశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం హజ్‌ హౌస్‌లు, షాదీఖానాలు, ఉర్దూ ఘర్‌లు నిర్మించారు. దుల్హన్‌ పథకం ద్వారా పేద ముస్లిం మహిళల పెళ్లికి అండగా నిలిచారు. రంజాన్‌ తోఫాను అందించారు. విదేశీ విద్య ద్వారా వందలాది మంది పేద ముస్లిం విద్యార్ధులు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. మొట్టమొదటిసారి ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించారు.

ఉర్దూ స్పెషల్‌ డీఎస్సీ ఇవ్వడంతో పాటు అబుల్‌ కలాం ఆజాద్‌ నేషనల్‌ యూనివర్సిటీ కోసం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కర్నూలులో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ముస్లిం సమాజానికి తోడ్పాటు అందించారు. ముస్లింలకు స్వయం ఉపాధి కోసం మొట్ట మొదటిసారిగా మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను పెట్టారు. భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. దేశంలోనే మొదటిసారిగా ఇమామ్‌, మౌజనులకు గౌరవ వేతనాలు ఇచ్చారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన టీడీపీకి యావత్‌ ముస్లిం సమాజం వెన్నుదన్నుగా ఉంటుందని వివరించారు. అందుకే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సోదరిడిపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అయితేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.