ఇచటి గాలి సోకినచో
ఎవరైనను కవులౌదురు,
కళావేత్త లౌదురనెడు
ఖ్యాతి గలది గుంటూరే!
తెనుగువాని కెవనికేని
తన సొంతమే ఈ ప్రాంతము
అనిపించెడు ఆత్మీయత
నందించును గుంటూరే!
తెనుగమ్మల కట్టు బొట్టు,
తెనుగయ్యల నీటుగోటు,
తెనుగువారి తీరుతెన్ను
తెల్పు కుదురు గుంటూరే!
అతిరధులకు, మహారధుల
కాలవాలమీ పురమని
దిద్ధిగంతకీర్తి గన్న
తెన్గుగడ్డ గుంటూరే!
కవనశ్రీనాధులతో
కవనశ్రీమంతులతో
తనదాపున, తనప్రాపున
ధన్యతగనె గుంటూరే!
పరిశుభ్రపు గాలి వీచు
పచ్చనైన ప్రకృతితోడ
వాసయోగ్యమైన పురిగ
వాసిగాంచె గుంటూరే!,
ఎంత బేలకైన గాని
కొంత కాలమిట నిల్చిన
బ్రతుకనేర్చు కళను గూర్చి
వడిగ నేర్పు గుంటూరే!
తెనుగువారి విందులందు
దివ్యమైన అంశముగా
మెప్పులందు గోంగూరకు
మేలిపాదు గుంటూరే!
ఎండుమిరప ఘాటునైన
మండుటెండ ధాటినైన
తట్టుకొనెడు దిట్టలున్న
పట్టణమ్ము గుంటూరే!!
….. ఇది తన గుండెల నిండుగా జన్మభూమి ఖ్యాతిని పదిలపరుచుకుని దాన్ని అక్షరబద్ధం చేసిన మహనీయులు, మా గుంటూరు కవీంద్రుడు శ్రీమాన్ ధనేకుల వెంకటేశ్వరరావు గారు. గుంటూరు మీద వారు రాసిన పద్యాలన్నీ పటికబెల్లం ముక్కలే..
ఈ ఊరి మీద ప్రేమ ఉన్న వారి గుండెల్లో చిరస్థాయిగా అవన్నీ ఉండిపోతాయి. ” బతకడమే కాదురా.. బతికించడమూ నేర్పిస్తుంది మన గుంటూరు” అంటుండేవారు మా టీజేపీఎస్ కళాశాల అధ్యాపకులు శ్రీ కోటయ్య గారు. ఆప్యాయతలకు, బంధాలకు కేరాఫ్ మా గర్తపురి! ఎంత రాసుకుని.. పొగుడుకున్నా మా గుంటూరుకి తక్కువే. ఓ ఆరు అంతస్తుల భవనం మీద నుంచి మా గుంటూరు సీమ ఇలా నా సెల్ ఫోన్ కెమెరాకి చిక్కింది ఇవాళ…
సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల
జర్నలిస్టు,
గుంటూరు.