అకమ్రాస్తులు, కేసులపై నానికి చిన్ని సవాల్
నీపై ఆరోపణలు నిరూపిస్తా…దమ్ముంటే నాపై నిరూపించు
లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయటపెడతా
ఎంపీగా పదేళ్లలో ఏం చేశావో నగర ప్రజలకు చెప్పు
నీపై కేసులు ఉన్నది వాస్తవం కాదా?
విజయవాడ, మహానాడు : విజయవాడ టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు, అన్నదమ్ములైన కేశినేని చిన్ని, కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. చిన్నిపై ఇటీవల నాని పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా అక్రమాస్తులు, కేసులపై చిన్ని శుక్రవారం విలేఖరుల సమావేశంలో కౌంటర్ ఇచ్చారు. నీ అక్రమాలు నేను నిరూపిస్తా…దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించా లంటూ సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకో..లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయటపెడతా అంటూ హెచ్చరించారు. మేము భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేశామో చెబుతున్నాం. కేశినేని నాని మాత్రం మాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.
ఎంపీగా ఏం చేశావో చెప్పు?
ఎంపీగా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏం చేశావో చెప్పాలని నిలదీశారు. నా కారు నెంబర్, నా స్టిక్కర్ వాడాడు అంటారు..తనపై అనేక కేసులు ఉన్నాయంటున్నాడు. దమ్ముంటే అవన్నీ నిరూపించి ఎన్నికల సంఘానికి చూపించాలని సవాల్ విసిరారు. ఫ్లైఓవర్ల నిర్మాణం నీ వల్ల జరిగిందా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నువ్వు ఒక్కడివే ఫ్లైఓవర్ కట్టావా? ఆనాడు సీఎంగా చంద్రబాబు స్థలాలు ఇచ్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఎంపీగా ఢల్లీి వెళ్లి వస్తే అవి నువ్వే చేసినట్లా? రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడా వా? కరోనా సమయంలో అడ్రస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయావు. నీ ఆధ్వర్యంలో ఒక్క కొత్త ఆసుపత్రి అయినా తెచ్చావా?
నీ అరాచకాలకు సాక్షిలోనే ఆధారాలు…
రాజకీయంగా ఎదుర్కోలేక ఎదుటి వాళ్లపై నిందలు వేస్తున్నావు. చాలెంజ్ చేస్తున్నా… నేను అడిగిన వాటికి సూటిగా జవాబు ఇచ్చే ధైర్యం నీకు ఉందా? పీవీపీపై నోరు పారేసుకుని నోటీసు అందుకోగానే కాళ్ల మీద పడిన వ్యక్తివి నీవు. నా మీద ఎటువంటి కేసులు ఉన్నా నిరూపించు. అబద్ధాలతో బతకడం మాని వాస్తవాలు చెప్పు. ల్యాండ్ గ్రాబర్ అని ప్రచారం చేస్తున్నావు. ఎక్కడెక్కడ ఏమున్నాయో బయటపెట్టు. నీ ఆఫీస్ పక్కన స్థలం కబ్జా చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. నీ అరాచకాలు, భూకబ్జాలపై నీ సాక్షితో సహా అన్ని మీడియా ల్లో ఆధారాలు ఉన్నాయి.
నీపై కేసులు ఉంది వాస్తవం కాదా?
నేను 264 గ్రామాలు తిరిగి వాటి అభివృద్ధి, మౌలిక వసతులకు ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రజలకు, నియోజకవర్గానికి ఏం చేస్తానో, ఏం చేయగలనో నేను చెబుతున్నా. దమ్ము, ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి ఈ అభివృద్ధి చేశా, ప్రజలకు ఈ మంచి చేశా అని చెప్పు.. అవి లేవు కాబట్టే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నావు. చిరంజీవి కన్నా గొప్ప నటుడు అని నాని నిరూపించుకున్నాడు. కలల రాజధాని అమరావతి వద్దు అని చెప్పడానికి సిగ్గు, శరం ఉందా. భూకబ్జాలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని చరిత్ర నీది. లేబర్ కోర్టులో నీపై కేసులు ఉంది వాస్తవం కాదా? మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నేను ఎప్పుడూ చిరాకు పడను, నోరు పారేసుకోను. మూడేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత ఖర్చుతో చేశా. కూటమి ప్రభుత్వం వచ్చాక నా పని తీరు మీరే చూస్తారు.
నాని ట్రావెల్స్‌కు, లోకేష్‌కు సంబంధమేంటి?
బూతులు తిట్టే వాళ్లని, రాష్ట్రాన్ని నాశనం చేసే వాళ్లని ఓడిరచండి. నా ఆస్తుల విషయంలో నేను వైట్ పేపర్ పెడతా. నాకు బినామీ ఆస్తులు, కేసులు, అక్రమ అస్తులు ఉంటే ఆధారాలతో బయట పెట్టాని సవాల్ విసిరారు. నాని ట్రావెల్స్ మూయడానికి, లోకేష్‌కు అసలు సంబంధం ఏమిటి? బస్సులు నడపలేక, జీతాలు ఇవ్వలేక మూసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పాలని ప్రయత్నించి టాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై తిరగబడిన వ్యక్తి నాని. చంద్రబాబు వాస్తవం తెలుసుకుని నానితో ఆ అధికారికి సారీ చెప్పించారు. కేశినేని ట్రావెల్ మూసివేతకు నాని అసమర్థత కారణం.
మళ్లీ 34 కోట్లతో హోటల్ పెట్టాడు..
నేను దొంగ సంతకం పెట్టానంటున్న నాని..నాపై క్రిమినల్ కేసు పెట్టవచ్చు కదా. చెల్లి ఏదో మాట అన్నదని ఆమెపై రెండు కేసులు పెట్టాడు. కేశినేని మా ఇంటి పేరు..నాకు సర్వహ క్కులూ ఉన్నాయి. ప్రజా జీవితంలో నాని లాంటి వ్యక్తులు ఉండకూడదు. సమాజానికే అది మంచిది కాదు. ఇటీవలి 34 కోట్లు అప్పు తీసుకుని ఒక హోటల్ కూడా నాని ప్రారంభించాడు. రాము, హేమంత్ పేరుతో హోటల్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆర్‌వోసీ ఇంటిమేషన్ లేదు..అంటే కుట్ర కోణమే కదా? అప్పులు ఎగ్గొట్టేలా, మళ్లీ లీజుకు కూడా ఇచ్చాడు. ఇటువంటి అవినీతి, అక్రమాలు చాలా ఉన్నాయి. వీళ్లా నాపై ఆరోపణలు చేసేది. నేను నిరూపిస్తా..దమ్ము ఉంటే వాళ్లు నా అక్రమాస్తులు, కేసులు నిరూపించాలని సవాల్ విసిరారు.