ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమృత ఆహారం

– నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్
– ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి

​గుంటూరు, మహానాడు: ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల రసాయనాల వినియోగం తగ్గిపోతుందని, ప్రభుత్వం ఎరువులపై ఇచ్చే సబ్సిడీ భారం తగ్గితే ఆ మొత్తాన్ని రైతుల ప్రయోజనాల కోసం వినియోగించవచ్చునని నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, ప్రకృతి వ్యవసాయం మరింతగా విస్తరించాలంటే ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చి పిల్లలకు బోధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి విధానాలపై అవగాహన కోసం రమేష్ చంద్ నేతృత్వంలో నీతి అయోగ్ ప్రోగ్రామ్ డైరక్టర్ డాక్టర్ నీలం పటేల్, వ్యవసాయ అనుబంధ విభాగం నుంచి పరేమల్ బనాఫర్ తదితరులు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం జిల్లాలోని నూతక్కి, దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు గ్రామాల్లో పర్యటించి, ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. రమేష్ చంద్ రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రీమియం ధర చెల్లించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం లను వినియోగించి పండిస్తున్న వరిని అమృత ఆహారం పేరుతో బ్రాండింగ్ చేసి విక్రయించాల్సిందిగా రైతులకు సలహా ఇచ్చారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి ఎ గ్రేడ్ మోడల్ అనుసరిస్తున్న రైతు శ్రీనివాస రెడ్డి (4 ఎకరాల) పొలాన్ని మొదట సందర్శించారు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 43 ఏళ్ళ నుంచి రసాయన పద్ధతులలో సాగు చేస్తున్న తాను ఏడేళ్ళ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతితో అరటి సాగు చేస్తున్నట్లు బృంద సభ్యులకు వివరించారు. అంతర పంటగా పసుపు, కోలాకేసియా, వేరుశెనగ, మిర్చి, ఉల్లి, క్యాబేజీ తదితర పంటలు సాగు చేస్తున్నానని, నాలుగేళ్ళ నుంచి ఏ ఒక్క కషాయం కూడా పిచికారి చేయకుండా అరటి సాగుచేస్తున్నట్టు తెలిపాడు.

అనంతరం ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఏలూరు జిల్లాలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్న సాగు చేస్తున్న వరి పొలాలను సందర్శించామని, చాలా వినూత్నంగా వరి పంటలు పండిస్తున్నారని, రసాయన క్షేత్రాలతో పోల్చి చూస్తే ప్రకృతి వ్యవసాయ పంటలు వాతావరణం లో వచ్చే మార్పులకు తట్టుకొని నిలబడుతున్నట్టు గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు డాక్టర్ డీవీ రాయుడు, చంద్రశేఖర్, గోపీచంద్, డాక్టర్ వరప్రసాద్, రామచంద్రం, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్ బాబు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, మంగళగిరి తహశీల్దారు సుభాని, దుగ్గిరాల తహశీల్దారు సునీత, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.