– పట్టణ ప్రణాళిక అధికారులు, సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు
– నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు
గుంటూరు, మహానాడు: గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్య వైఖరి కనబరిచిన ప్రణాళిక అధికారులకు, సంబంధిత సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణాలపై వచ్చిన వార్తా కథనాలపై ప్రాథమిక స్థాయిలో సిటి ప్లానర్ నేతృత్వంలో పట్టణ ప్రణాళిక అధికారులు విచారణ చేశారని, ఆ నివేదిక మేరకు తాము కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించామని తెలిపారు.
ప్రణాళిక అధికారుల నివేదిక ప్రకారం రైల్వే శాఖ 2023 మే 25న తాము జారీ చేసిన ఎన్ఓసి ని రద్దు చేస్తున్నట్టు నగరపాలక సంస్థకు లేఖ పంపిందని పేర్కొన్నారు. ఆ లేఖ అప్పటి సిటీ ప్లానర్ ద్వారా సంబంధిత విభాగ సూపరింటెండెంట్, గుమస్తా ద్వారా టీపీఎస్ కి పంపబడి, అక్కడే ఎటువంటి చర్యలు లేకుండా పెండింగ్ లో ఉంచారన్నారు. ఆ లేఖపై స్పందించని అధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు, కమిషనర్ కు సిఫార్స్ చేయని కారణంగా నాటి విభాగ సూపరింటెండెంట్, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు 2015 నుండి ఇచ్చిన అనుమతులు, నిర్మాణ పర్యవేక్షణ లోపంపై నాటి పట్టణ ప్రణాళిక అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.