అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం పనిచేయాలి
ఐదేళ్ల విధ్వంసంపై న్యాయ విచారణ జరిపించాలి
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
అమరావతి: రాష్ట్రంలో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మోములో కొత్త చంద్ర బింబం చూడాలని, కొంగొత్త పాలన అందించాలని కోరుకుంటున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఈ విజయాన్ని పురాణ, ఇతిహాసాల కథలతో పోల్చి కీర్తించారు. ఈ విజయంలో అమరావతి ఉద్యమంతో పాటు దళిత మహోద్యమ ఉద్యమం పూలదండలో దారంలా దాగుందన్నారు. కొత్త ప్రభుత్వాన్ని మూడు వరాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. 1. రాజధాని అమరా వతి నిర్మాణం, అభివృద్ధి, రక్షణ 2.ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, దాని ద్వారా సమగ్ర న్యాయ విచారణ 2. ఖచ్చిత మైన, నిజాయితీతో కూడిన సామాజిక న్యాయ సుపరిపాలన కావాలన్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతి ప్రాంతంలో అసువులు బాసిన అమరావతి అమరవీరుల స్మతి చిహ్నం నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రైతు మహిళా నాయకురాలు కొమ్మినేని వరలక్ష్మి, రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.