పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం
పర్యాటక బ్రాండింగ్, ప్రమోషన్ పై ఫోకస్
టూరిజం ప్రమోషన్ లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం
తెలంగాణ పర్యాటకాభివృద్ధికి చేయూతనివ్వాలని ఐటీ ఉద్యోగులు, యువతకు మంత్రి జూపల్లి పిలుపు
హరిత హోటల్స్ లో ఐటీ ఉద్యోగులకు 15% డిస్కౌంట్
రహేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగులతో కలిసి డిస్కౌంట్ కూపన్ ను లాంచ్ చేసిన మంత్రి జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించేలా పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే సీయం రేవంత్ రెడ్డి అకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్రమోషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది.
ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యo కల్పించి ప్రోత్సహించేందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ… టూరిజం ప్రమోషన్ లో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నారు.
మరోవైపు ఐటీ ఉద్యోగులు, యువత, వివిధ సంఘాలు, స్థానికుల సహకారంతో తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి విస్తృత ప్రచారం రాబట్టాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ లో ఐటీ ఉద్యోగులతో మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్ ను లాంచ్ చేశారు. పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని వారిని కోరారు.
టూరిజం ప్రమోషన్ లో భాగంగా మైండ్ స్పేస్ లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు హరిత హోటల్స్ లో 15 శాతం డిస్కౌంట్ అవకాశం కల్పిస్తున్నామని, దీన్ని మరిన్ని ఐటీ కంపనీ ఉద్యోగులకు విస్తరిస్తామని ప్రకటించారు. స్కాన్ కోడ్ లో రిజిస్టరైన ఐటీ ఉద్యోగులు ఈ డిస్కౌంట్ కూపన్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం (మార్కెటింగ్) కల్పించి, పర్యాటకులను ఆకర్శించేందుకు తానే స్వయంగా సేల్స్ మెన్ అవతారం ఎత్తి ఇక్కడకు వచ్చానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి – సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమని, చరిత్ర, వారసత్వ సంపద, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, జలవనరులు, సెలయేర్లు, దేవాలయాలు, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సంసృతి, మెడికల్ టూరిజం లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వివరించారు. ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం కనీస ప్రచారానికి కూడా నోచుకోలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తెలంగాణ పర్యాటకాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నామని, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించేందుకు ఆధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యాంత్రిక జీవన విధానం నుంచి బయటపడేందుకు పాశ్చత్య దేశీయులు వారంతాల్లో మానసికోల్లాసం, ఆట విడుపు కోరుకుంటారని తెలిపారు. వారానికి లేదా నెలకు ఒక్కసారైనా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాలని పర్యాటకులను కోరారు.
పర్యాటకంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్యాటక ప్రదేశాల్లో తెలంగాణ కళారూపాలను ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి వల్ల సందర్శకుల సంఖ్య పెరిగి వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా వివిధ విమనాశ్రయాలు, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రదర్శించి.. విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే పర్యాటక శాఖ కొత్త వెబ్ సైట్ ను లాంచ్ చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, పర్యాటక శాఖ సంచాలకులు ఇలా త్రిపాఠి, రహేజా గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనే శ్రవణ్ కుమార్, హైదరాబాద్ సాప్ట్వేర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మెంబర్ బిపిన్ చంద్ర, ఐటీ ప్రమోషన్ అమరనాథ్ రెడ్డి, ఐటీ ఐద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.