కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు
బదిలీపై వెళ్లిన జవహర్‌రెడ్డి..ఆ వెంటనే ఉత్తర్వులు
సీఎంవో టీమ్‌పైనా కొనసాగుతున్న కసరత్తు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియమితుడయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి సెల వుపై వెళ్లగా కొత్త సీఎస్ నియామకం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును నీరభ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ నున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి. సీఎంవోలో కొత్త టీమ్‌పై కసరత్తు కొనసాగుతోంది. సీఎం ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్థికశాఖలో పనిచేశారు. సాయిప్రసాద్‌ను కూడా సీఎంవో లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారానికి ముందే నియామకాలు పూర్తి కానున్నాయి.