ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
అమరావతి : కృష్ణా నది వరదల విపత్తు నేపథ్యంలో బుధవారం నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం జరిగిందన్నారు. దీంతో యావత్తాంధ్రప్రదేశ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయిందన్నారు. ఇటువంటి దు:ఖ సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సబబుకాదని, అందుకే రేపటి వేడుకలకు దూరంగా ఉంటున్నానని స్పీకర్ తెలియజేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనను కలవొద్దని కోరారు. తీవ్ర దుఃఖంలో ఉన్న వరద బాధితులకు సాయం చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ ప్రకటనలో కోరారు.