– కొల్లాపూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి
– బైక్‌పై వెళ్లి నీటమునిగిన పంటలు, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన
– రైతులను పరామర్శించిన మంత్రి జూపల్లి
పాన్ గల్: భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్లను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాన్ గల్ మండలం దావాజీ పల్లి , అన్నారం, కొత్తపేట, రాయినిపల్లి, బండపల్లిలో మంత్రి పర్యటించారు. రాయినిపల్లి నుంచి బండపల్లి వరకు బైక్ పై వెళ్లి గండిపడిన కాలువ, దెబ్బతిన్న రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన ప్రతి ఎకరాకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. నీట మునిగి నష్టపోయిన పంట పొలాల వివరాలు అధికారుల ద్వారా సేకరించి..ఎకరానికి రూ. 10 వేల పంట నష్ట పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ శాఖ అధికారులు పంటపొలాలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. యుద్ద ప్రతిపాదిక రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని, గండి పడిన కాల్వలను వెంటనే పూడ్చాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.