తాగునీటికి ఆందోళన వద్దు

ఎమ్మెల్యే జీవీ చొరవతో గుండ్లకమ్మ నుంచి త్రాగునీరు
సింగరచెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

వినుకొండ, మహానాడు: గుండ్లకమ్మ నది నుండి వినుకొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. తొలి ఏకాదశి పండుగ నిర్వహణపై సమీక్షలో భాగంగా శుక్రవారం వినకొండకు వచ్చిన కలెక్టర్ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చెరువు అడుగంటడంతో చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  చెరువులో నీరు అడుగంటడంతో కేవలం మరో 15 రోజులు మాత్రమే నీరు వస్తాయని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు గుండ్లకమ్మ నది నుండి తా \గునీటిని సరఫరా చేసి యధావిధిగా పట్టణానికి నీటి సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణానికి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్ లో ఉండటం వలన నీటి విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు.

ఎగువ కురిసిన వర్షాలకు  ఆల్మట్టి డ్యాం నుంచి శ్రీశైలం డ్యామ్, నాగార్జునసాగర్ డ్యామ్ లకు నీటి విడుదల కొంత ఆలస్యం అయ్యేటట్టు ఉందని, వినకొండకు దగ్గరగా చీకటిగల పాలెం అండర్ రోడ్డు వద్ద గుండ్లకమ్మ నది నుండి తాగునీటిని వినుకొండ పట్టణానికి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గుండ్లకమ్మ నది నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టణంలోని సింగర చెరువు ఫిల్టర్ బెడ్ల వద్ద డంపింగ్ చేసి నీటిని శుద్ధపరచి స్వచ్ఛమైన త్రాగు నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు తాగునీటి విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వినుకొండ పట్టణంతో పాటు పల్నాడు జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కృష్ణా రివర్ బోర్డుతో చర్చించి త్వరలో నాగార్జునసాగర్ కుడి కాలువకు తాగునీరు విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డీఈ వెంకయ్య, టీడీపీ నాయకులు పీవీ సురేష్ బాబు, షమీం ఖాన్, పువ్వాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.