ముంబయి: టాటా ట్రస్టుల నూతన చైర్మన్ గా నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. రతన్ టాటా స్థానంలో నూతన చైర్మన్ ఎంపిక విషయంపై శుక్రవారం ముంబైలో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడు, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో ఆయన వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థలకు నోయెల్ టాటానే చైర్మన్గా ఉన్నారు. అలాగే, టాటా ఇంటర్నేషనల్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్గా కొనసాగు తున్నారు.
కొద్దిపాటి పెట్టుబడితో మొదలైన ట్రెంట్ సంస్థను వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దడంలో నోయెల్ టాటా పాత్ర కీలకం అని చెబుతారు. అంతేకాకుండా ఇండియాలో సిస్లె, జరా బ్రాండ్స్ లాంచ్ చేసిన ఘనత కూడా నోయెల్ టాటాదే.