ఆలయాల్లో ‘అన్యమత’ అర్చన

    • ఇప్పటివరకూ డిక్లరేషన్ ఇవ్వని ఆలయ ఉద్యోగులు
    • డిక్లరేషన్‌పై నాటి సీఎస్ ఎల్వీ ఉత్తర్వులు
    • ఆలయ ఉద్యోగులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ ఆదేశాలు
    • అన్యమతస్థులు ఉంటే ఇతర శాఖలకు వెళ్లాలని సూచన
    • ఎల్వీ ఆదేశాలతో ‘చర్చి’లో కలవరం
    • ఆ తర్వాతనే ఎల్వీ కుర్చీకి ఎసరు
    • టీటీడీలోనే అన్యమత ఉద్యోగులు అధికం
    • మినిస్టీరియల్ స్టాఫ్, ఇంజనీరింగ్ ఉద్యోగుల్లో వారే ఎక్కువ
    • శ్రీశైలం, సింహాచలం ఆలయాలకూ అన్యమత సెగ
    • కూటమి రాకతోనయినా ‘ఫైలు’ కదులుతుందా?
    • అధికారం రాగానే పాత డిమాండ్లను మరిచిన బీజేపీ
    • నాడు ఆలయాల్లో అన్యమతస్తులను ఏరివేయాలని డిమాండ్
    • ఇప్పుడు వ్యూహాత్మక మౌనవ్రతం

( మార్తి సుబ్రహ్మణ్యం)

పాలకులు మారినా.. పార్టీలు మారినా… ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో అన్యమత అర్చనలు మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నాయి. గత ఐదేళ్ల జగన్ జమానాలో విశృంఖంగా సాగిన అన్యమత నియామకాల నుంచి ఆలయ పరిసరాల్లో షాపుల కేటాయింపుల వరకూ అన్యమతస్తులదే అగ్రభాగం. ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను ఇతర శాఖలకు పంపించాలన్న ప్రతిపాదన.. ప్రతి ఆలయ ఉద్యోగి తాను హిందువునేనన్న డిక్లరేషన్.. రెండూ కొండెక్కాయి. దానిని అమలు చేయాలని రెండునెలల క్రితం వరకూ గళమెత్తిన బీజేపీ ఇప్పుడు అధికార భాగస్వామి కావడంతో తన డిమాండును జమ్మిచెట్టెక్కించింది.

టీటీడీ సహా ఏపీలోని పెద్ద దేవాలయాల్లో, అన్యమత ఉద్యోగులను గుర్తించేందుకు పాలకులు వణికిపోతున్నారు. ఆలయాల్లో అర్చకులు మినహా, మిగిలిన అన్ని విభాగాల్లోనూ అన్యమత ఉద్యోగులు దశాబ్దాల నుంచి తిష్టవేసుకున్నారు. వారిని కదిలించేందుకు ఏ ప్రభుత్వం సాహసించని ఫలితంగా, కొత్తగా మరికొందరు అన్యమతస్తులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య వందల్లోనే ఉంటుందన్నది ఒక అంచనా.

పేరుకు వీరంతా దళితులే అయినప్పటికీ, క్రైస్తవ మతంలో మారిన వారి సంఖ్యనే ఎక్కువ. వీరిలో చాలామంది ఆలయాల్లో ఉద్యోగాలు చేసుకుంటూనే, ప్రతి ఆదివారం చర్చిల్లో ప్రార్ధనలకు వెళుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. వీరి కుటుంబాల్లో శుభ-అశుభకార్యాలన్నీ క్రైస్తవమత సంప్రదాయాల్లోనే జరుగుతుండటం విశేషం. వాటికి సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే చాలామంది మతం మారిన దళిత ఉద్యోగులు ఆలయ ఈఓలుగా సైతం కొనసాగుతున్న వైచిత్రి. ఒక్క టీటీడీలోనే సుమారు 70 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో కొనసాగుతుండటం విశేషం. శ్రీశైలం, సింహాచలం వంటి పెద్ద ఆలయాల్లోనూ అన్యమత ఉద్యోగులు దశాబ్దాల నుంచి తిష్టవేసినా, వారిని కదిలించే సాహసం ఏ ప్రభుత్వం చేయకపోవడం ప్రస్తావనార్హం. పెద్ద ఆలయాల ప్రాంగాణాల్లో ఉన్న షాపులను సైతం ఇతర మతాల వారికి కేటాయించడం మరో వింత.

ఆలయాల్లో కొనసాగుతున్న ఈ అపచారాన్ని గ్రహించిన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు.. తామంతా హిందువులమేనని, హిందు సంప్రదాయాలు పాటిస్తున్నామని, మతం మారలేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎల్వీ ఆదేశాలు జారీ చేశారు.

అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు, ఎల్వీ టీటీడీలో అన్యమత ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. ఆ మేరకు టీటీడీలో ఎంతమంది అన్యమత ఉద్యోగులున్నారన్న దానిపై ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీశైలం, సింహాచలం ఈఓలకూ అలాంటి ఆదేశాలు జారీ చేశారు.

అదే సమయంలో ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక, క్రైస్తవ మతప్రచారానికి సంబంధించిన సూక్తులు వివాదానికి దారితీసింది. దానిపై ఆగ్రహించిన నాటి సీఎస్ ఎల్వీ విచారణకు ఆదేశించి, నివేదిక ఇవ్వాలన్నారు. ఫలితంగా తిరుపతి డిపో ఆర్టీసీ అధికారిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎల్వీ.. నిబంధనల ప్రకారం హిందూ ఆలయాల్లో ఇతర మతాల వారు పనిచేయాడానికి అనర్హులని స్పష్టం చేశారు. మతం మారేందుకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఆ మతం వారు హిందూ దేవాలయాల్లో పనిచేసేందుకు మాత్రం అర్హులు కారన్నారు. ఇది కేవలం హిందువులకే పరిమతమైన వ్యవస్థ కాబట్టి, హిందూమతంపై నమ్మకం లేని వారు, ఇతర మత విశ్వాసాలు పాటించే వారు ఇతర శాఖలకు వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తామని ప్రకటించారు.

ఇదంతా జరిగిన సమయంలో నాటి సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత.. ఆలయాలకు సంబంధించి, తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎల్వీ సీఎం జగన్‌కు వివరించారు. దానితో ఆయన సరే అన్నా అన్నారట. అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది.

ఎల్వీ ఆదేశాలతో కలవరపడ్డ మతం మారిన క్రైస్తవ ఉద్యోగులు, చర్చిని ఆశ్రయించారు. దానితో రంగంలోకి దిగిన చర్చి.. జగన్ కుటుంబపెద్ద అయిన ఒక మహిళను రంగంలోకి దింపింది. కొద్దికాలానికే ఎల్వీని అవమానకర రీతిలో, అప్రాధాన్యమైన చోట బదిలీ అయ్యారు. దానితో సెలవుపై వెళ్లిన సీఎస్.. అటుంచి టే పదవీవిరమణ చేయాల్సి వచ్చింది. ఈ పరిణమాలతో.. ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల గుర్తింపు-ఏరివేత ప్రకియ విజయవంతంగా నిలిచిపోయింది.

ఆ సమయంలో ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల అంశంపై బీజేపీ నానా రచ్చ చేసింది. వారిని అక్కడి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. జగన్ హిందుత్వాన్ని క్రైస్తవీకరణ చేస్తున్నారని, హిందూ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అన్యమత ప్రచారం వెనుక, జగన్ ప్రోత్సాహం ఉందని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్ల వెనక జగన్ ఉన్నారని ఆరోపించింది.

ప్రకాశం జిల్లాలో అయితే నాటి మంత్రి ఆదిమూలం సురేష్ అండతో.. కొండలపై వెలసిన శిలువలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కూల్చివేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రకాశం జిల్లాలో విస్తృతంగా జరిగిన మతమార్పిళ్లను అడ్డుకున్న బీజేపీ నేత శ్రీనివాస్‌ పై పోలీసులు లెక్కలేనన్ని కేసులు పెట్టారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో హిందుత్వ చైతన్యం ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ మత మార్పిళ్ల ప్రభావమేనని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో, ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల అంశాన్ని జమ్మిచెట్టుపైకెక్కించింది. నాటి సీఎస్ ఎల్వీ ఆదేశాలు అమలు చేసేందుకు అవకాశం-అధికారం ఉన్నప్పటికీ, బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం.. ఆ పార్టీని నడిపిస్తున్న ఆరెస్సెస్ కూడా మౌనవ్రతం పాటించడమే ఆశ్చర్యం.