Mahanaadu-Logo-PNG-Large

జలయజ్ఞం కాదు…దగా యజ్ఞం

చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేశావా జగన్‌?
భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అంటూ దగా చేశావ్‌
పామాయిల్‌కు గిట్టుబాటు ధర అన్నావ్‌…చేశావా?
చింతలపూడి సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

చింతలపూడి, మహానాడు : నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు..జలయజ్ఞం పేరిట ప్రజలను దగా చేశారని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఎలిజాను ఎందుకు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు అని అడిగా. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నానో తెలియదన్నారు. కనీసం రోడ్లు వేపిద్దామంటే కూడా నిధులు ఇవ్వలేదు అని చెప్పారు. జగన్‌ను అపాయింట్‌మెంట్‌ అడిగితే ఒక్కసారి కూడా ఇవ్వలేదు అన్నారు. చింతలపూడి ప్రాజెక్ట్‌ కోసం చేయని ప్రయత్నం లేదని, అలసి పోయి ఇక ఇక్కడ ఉంటే ప్రాజెక్ట్‌ పూర్తి కాదని నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ఎలిజా చింతలపూడి నియోజకవర్గానికి రత్నం. ఈ రత్నం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మీ ముందుకు వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఇక్కడకు వచ్చారు. చింతలపూడి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు.

ప్రాజెక్టు పూర్తయితే ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, పక్క నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేది కానీ, ఐదేళ్లలో చింతలపూడి పథకానికి తట్టెడు మట్టి పోయలేదు. జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన పాపాన పోలేదు. పామాయిల్‌ పంటకు గిట్టుబాటు ధర అన్నారు… నష్టపరిహారం ఇస్తా అన్నా డు..మరిచారు. 2019లో పంట తక్కువ ధరకే అమ్మితే పరిహారం ఇస్తామని మోసం చేశారు. మేనిఫెస్టో నాకు భగవద్గీత..బైబిల్‌..ఖురాన్‌ అన్నాడు. ప్రజలను దగా చేశాడు. సీఎం అయ్యాక ఒక్క రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చింది లేదు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారు. పదేళ్ల్లలో కనీసం 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు…మనకు మిగిలింది చేతిలో చిప్పేనని మండిపడ్డారు.