-జ్ఞాపకాలను పంచుకున్న అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి
-తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్ ప్రశంస
-జయంతి సందర్భంగా ఘన నివాళి
అవనిగడ్డ, మహానాడు: తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్ అని అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అవని గడ్డలో ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన వివాహానికి ఎన్టీఆర్ స్వయంగా హాజరైన ఫొటోలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ఎన్టీఆర్ తమ వివాహానికి విచ్చేసి ఆశీస్సులు అందించడం మధురానుభూతిగా నేటికీ నిలిచి ఉందన్నారు. పేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. సినిమా రంగంలో ఎన్నో విభిన్న పాత్రలకు జీవం పోసి విశ్వ విఖ్యాత, నటసార్వభౌముడుగా, ఆంధ్రప్రదేశ్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో పేదల సంక్షేమ రాజ్యానికి బాటలు వేసిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని ప్రశంసించారు.