Mahanaadu-Logo-PNG-Large

ఎన్టీఆర్.. సింగిల్ పీస్!

ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఒకే ఒక్కడు, సింగిల్ పీస్ ఇన్ ద వరల్డ్ ! ఆయన శత జయంతి పూర్తి నేడు. ఆయనపై కొందరి ట్రోల్స్ చూశాను, ఆయనలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఒకే యుగ పురుషుడు అని చెప్పనుకానీ, మాట మార్చని మడమ తిప్పని ఆత్మాభిమాన ధనుడు, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా అందరినీ తిన్నగా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆయన 95లో పదవీచ్యుతులు చేయబడి, దివంగతులైననాటి అప్పటి పరిస్థితులు మాత్రం నాలాంటి వారికి బాధ కలిగించాయి.

అప్పటి పార్లమెంట్ ఎన్నికల వరకు అధికారంలో ఉండి ఉంటే కచ్చితంగా దేశ ప్రధానమంత్రి అయ్యేవారు, సామాన్య ప్రజల కోసం వినూత్నమైన మార్పులు తీసుకుని వచ్చేవారు. అయితే ఈ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి, ఈ ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంచుకునే గొప్ప నాయకుడు, గొప్ప నటుడు. తెలుగు నాట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరియు సామాజిక విప్లవానికి ఆద్యుడు.

1984లో ఆయన్ని దింపేసినప్పుడు వేరే రాష్ట్రంలో ఉండే నేను అవన్నీ వదిలేసి తిరిగివచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసేంతవరకు చాలా గట్టిగా ఉద్యమించాను. ఆయనపై నా అభిప్రాయాలు స్థిరంగానే ఉన్నాయి, రాజకీయాల, పరిస్థితులబట్టి ఉండవు. మా ఇంట్లో పెళ్లికి వారి నలుగురు కుటుంబ సభ్యులు వచ్చింది నా జీవితాంతం గుర్తుంచుకుంటాను.

ఈ దేశ చరిత్రలో ఏ కాలేజీ పాలిటిక్స్ లేదా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక పార్టీ పెట్టి 9 నెలలలో ఒక పెద్ద రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, వచ్చిన సంవత్సరంన్నరలో ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఐదు సంవత్సరాలు వ్యవహరించే స్థాయికి తీసుకెళ్లి వ్యక్తి… కాదు కాదు ఒక శక్తి. జనతా ప్రయోగం విఫలం అయిన తర్వాత తిరిగి దేశంలో ప్రతిపక్ష నాయకులు అందర్నీ బెజవాడకు పిలిచి ఏకం చేసిన జాతీయ నాయకుడు.

నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా 1989లో ఏపీ సింగ్ ప్రభుత్వం వచ్చినప్పుడు గురుతరమైన బాధ్యత నిర్వహించినవారు. వారితో నాకు పరిచయం ఉన్నా, అది తక్కువ పరిచయం అయినా ఆయనంటే ఒక అభిమానం.. కానీ అది గుడ్డి అభిమానం కాదు, తెలుగునాట రాజకీయ, సంక్షేమ విప్లవం తీసుకొచ్చినదానికి అభిమానం. తెలుగువారికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు రావడానికి కారకులైన పెద్దలలో ఒకరు. తెలుగునాట ఎన్నో వాటికి ఆద్యులు వారు.

మొట్టమొదటిసారి బీసీ కులాలకు రాజకీయ రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన నాయకుడు, తెలుగుగంగ, PABR ఇంకా ఎన్నో ప్రాజెక్టులకు ఆద్యులు, రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు దేశంలో మొదటిసారి ఆస్తి హక్కు, మధ్యాహ్న భోజన పథకం, పేదలకు సబ్సిడీ రేట్లకు వస్త్రాలు, రైతులకు భూమిశిస్తు రద్దు, విద్యుత్ హార్స్ పవర్ కు 50 రూపాయలకే అలాగే పటేల్ పట్వారి మరియు గడీల వ్యవస్థకు అంతం దాంతోపాటే ప్రజలే దేవుళ్ళు అంటూ మండల వ్యవస్థ ఏర్పాటు, తెలుగు విశ్వవిద్యాలయం మరియు దేశంలో మొదటిసారి మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పాటు, మెడికల్ కళాశాలలలో డోనేషన్ సిస్టం రద్దు.

అప్పటికి రాష్ట్రంలో ఒకే మెడికల్ ప్రైవేట్ కళాశాల అదీ తన బంధువులకు చెందినా సరే దాన్ని ప్రభుత్వం తీసుకుని రాష్ట్రంలో కోస్తా తెలంగాణ రాయలసీమ అన్ని ప్రాంతాలకు దానిలో హక్కు కల్పించడం ( నేటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకి జనాభాను బట్టి ప్రాతినిధ్యం ఉన్న ఏకైక ప్రభుత్వం మెడికల్ కళాశాల అదే), మరియు తిరుమలలో నిత్యాన్న దాన పథకం మొదలు, పోలీసు వ్యవస్థ పటిష్టం, హైదరాబాదులో మతకల్లోలాలకు ముగింపు.

ఈ దేశంలో మొదటిసారి పేదలకు పక్కా ఇళ్లు కట్టించడం, అసలు పార్టీ పెట్టినప్పుడు తమ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కచ్చితంగా వారి పదవులకు రాజీనామా చేయాలని నిబంధన పెట్టి అమలు చేయించిన నాయకుడు… ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఆయనకు చాలాకాలం క్రితం ఒక శిలా విగ్రహం ఏర్పాటుచేసి, నలుగురూ కూర్చోడానికి చిన్న కాలక్షేప మండపాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యదాతగా ఉన్నాను, క్రితం సంవత్సరం అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన చిత్రం షేర్ చేసాను.

– చలసాని