కలకత్తా హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం
బెంగాల్ విధానమే ఏపీ, తెలంగాణలో ఉంది
రెండు రాష్ట్రాలకు కలకత్తా తీర్పు వర్తిస్తుంది
మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్
హైదరాబాద్, మహానాడు : పశ్చిమబెంగాల్‌లో ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు మమతాబెనర్జీ, ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు నిర్ణయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో గతంలో 75 తెగలను ఓబీసీలో కలిపి ఈ వర్గానికి తీరని నష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఒక వర్గం మెప్పు కోసం చేసిందని కోర్టు స్పష్టంగా తీర్పులో పేర్కొంది. మరోవైపు హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోమని అంటున్న మమతా బెనర్జీ తీరు న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ఉందని మండిపడ్డారు. కోర్టు తీర్పును రాజకీయాలకు ముడిపెట్టడం దిగజారుడుతనంగా అభివర్ణించా రు. కలకత్తా తీర్పును మేము ఆహ్వానిస్తున్నామని, మమతాబెనర్జీ తీరుకు నిరసన గా దిష్టిబొమ్మ దహనం చేస్తామని తెలిపారు. బెంగాల్ విధానమే ఏపీ, తెలంగాణ లో ఉంది. కోర్టు తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. కర్నాటకలో కూడా తీర్పు వర్తిస్తుందని కాంగ్రెస్ గమనించాలి. తెలంగాణలో బీసీ ఈ పేరు మీద 4 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగు తుందని పేర్కొన్నారు.