ప్రతి ముగ్గురు నిరాక్షరాస్యుల్లో ఒకరు భారతీయులు

– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి

చీరాల, మహానాడు: ప్రపంచంలో 100 కోట్ల మంది నిరాక్షరాస్యులు ఉంటే అందులో 33 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే కొనసాగుతున్నారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ హాలులో ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎ. నాగ వీరభద్రా చారి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రంగా ఉండటం దురదృష్టకరమన్నారు. కేరళ రాష్ట్రం 98 శాతం అక్షరాస్యత తో అగ్ర భాగాన ఉందని తెలిపారు.

1990 దశాబ్దంలో దేశవ్యాప్తంగా జరిగిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా 13 శాతం అక్షరాస్యత పెరిగిందని ఆంధ్రప్రదేశ్ లో 17 శాతం అక్షరాస్యత పెరిగిందన్నారు. 1967 సెప్టెంబర్ 8 నుండి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో లక్షలాదిమంది స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకు వచ్చి కోట్లాది మంది నిరాక్షరాస్యులకు చదువు నేర్పినారని గుర్తు చేశారు. అలాంటి అక్షర ఉద్యమం మరోసారి ఆంధ్రప్రదేశ్ లో రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించి అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు అత్తలూరి రామారావు, పోలుదాసు రామకృష్ణ, కొసనం నాగమాంబ, బత్తుల బ్రహ్మారెడ్డి, వడరి రాధాకృష్ణ తదితరులు ప్రసంగించారు.