ఒకరి పిలుపు శాంతి… మరొకరి పిలుపు జై జవాన్.. జై కిసాన్!

– టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతులు

మంగళగిరి, మహానాడు: సత్యమే తన మతమై.. ధర్మమే తన సైన్యమై.. అహింస అనే ఆయుధాన్ని చేతపట్టి.. భారతావనికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయులనందించిన జాతిపిత జయంతి సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అలాగే జై జవాన్.. జై కిసాన్ నినాదంతో దేశం కోసం దేశ ప్రజలకోసం పాటు పడిన లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

సమస్త ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహనీయుడిగా గాంధీజీని కొనియాడారు. భారతదేశానికి స్వతంత్రం కోసం గాంధీ మార్గం అందరికీ ఆదర్శమన్నారు. గాంధీ సిద్ధాంతాలు నేటి మానవాళికి ఎంతో మేలన్నారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అంటూ ఆయన చెప్పిన సూక్తులు సర్వమానవాళికి హితమన్నారు. ప్రపంచంలో అహింసకు రెక్కలు వస్తోన్నాయని.. యుద్దాలతో రక్తం ఏరులై పారుతూ ప్రజలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

శాంతికాముక దేశమైన భారత్ గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ ప్రపంచ శాంతికి, సౌభ్రాతృత్వం కోసం, విశ్వమానవ కళ్యాణం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. గాంధీ మహాత్ముడి ఆదర్శాలతో ఏపీలో అరాచకాలను అరికట్టి ప్రజలకు స్వేచ్ఛావాయులను అందిస్తూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని.. బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని చంద్రబాబు సాకారం చేస్తున్నారని.. సమాజ హితమే తన అభిమతంగా చంద్రబాబు గాంధీజీ ఆశయాలకోసం నిరంతరం కృషి చేస్తున్నారని నేతల కొనియాడారు. అలాగే చంద్రబాబు 2012న ప్రజలకోసం పాదయాత్ర చేపట్టి 13 ఏళ్లు అయిన సందర్భంగా నేతలు కేక్ కట్ చేశారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మీడియా కో ఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, నేతలు చప్పిడి రాజశేఖర్, చెన్నుపాటి గాంధీ, కోటేశ్వరరావు, చలపతిరావు, సైలజా, కృష్ణా, కేంద్ర కార్యాలయ రిసెష్పన్ ఇంచార్జ్ హాజీ హషన్ భాష తదితరులు పాల్గొన్నారు.