Mahanaadu-Logo-PNG-Large

బీజేపీ పై ఆపరేషన్ మిథునం

– బీజేపీ అగ్రనేతతో ఓ వైసీపీ నేత రహస్య భేటీ
– ఇప్పటికే ఆయనపై లిక్కర్ అమ్మకాల ఆరోపణలు
– ఆయనపై గతంలో విరుచుకుపడిన బీజేపీ
– కొంతకాలం లిక్కర్ ఉద్యమం నడిపిన బీజేపీ
– తాజాగా అదే నేతతో ఓ బీజేపీ అగ్రనేత మంతనాలు
– ఆ నేత ఇంట్లోనే రహస్య భేటీ?
– రాజంపేట సీటు బీజేపీ తీసుకోవాలన్న మంత్రాంగం
– ప్రధాని సభ ఏర్పాట్లకు దూరంపై పార్టీ నేతల అసంతృప్తి
– ఐబీ దృష్టికి వారిద్దరి భేటీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ అగ్రనేత బీజేపీలో అత్యంత కీలకనేత. పొత్తులో ప్రధాన పాత్ర పోషిస్తున్న ముఖ్య నేత. అలాంటి నేత ఇంటికి.. తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్ధి-సీఎంకు అత్యంత ఆప్తుడు-వ్యాపార భాగస్వామి అయిన వైసీపీ పార్లమెంటునేత వెళ్లడాన్ని ఎవరైనా ఊహిస్తారా? అసలు అపాయింట్‌మెంట్ అడగ్గానే.. ‘‘మీరు ఈ సమయంలో నన్ను కలవడం మంచిది కాదు. తప్పుడు సంకేతాలు వెళతాయి. అయినా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’’ అని చెప్పాలికదా? ఏ కీలకనేతయినా ఎన్నికల సమయంలో చేసేది అదే కదా?

కానీ అందుకు భిన్నంగా, ఆ బీజేపీ ముఖ్య నేత.. వైసీపీ యువనేతతో భేటీ అయిన వైనం పార్టీ వర్గాల్లో గుప్పుమంది. హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సదరు ముఖ్య నేత – ఏపీ సీఎం జగన్‌కు అత్యంత ఆప్తుడయిన ఆ యువ పార్లమెంటు ప్రజాప్రతినిధితో భేటీ అయిన విషయ,ం చివరకు ఐబికి సైతం తెలిసిపోయిందట. ఇది ఇప్పుడు బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే బీజేపీలో వైసీపీ కోవర్టుల హడావిడిపై ఆందోళనతో ఉన్న పవ్వుపార్టీకి.. తాజా ఈ ‘మిధున’రాశి ప్రవేశం మరింత ఆందోళనకు గురిచేస్తోందట.ఇది కూడా చదవండి: కమలంలో ‘మిధున’ం?

మరో రెండురోజుల్లో ప్రధాని సభ జరగబోతోంది. పదేళ్ల తర్వాత మోదీ కూటమి సభకు హాజరవుతున్నారు. ఆ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించాల్సిన సదరు కీలకనేత.. వైసీపీ ఎంపీతో మంతనాలు సాగించడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

పొత్తులో బీజేపీకి కేటాయించిన సీట్లు ఎవరికి ఇస్తున్నారు? బీజేపీ ఏ సీటు తీసుకోవాలి? అనేది ఖరారు చేయాల్సింది, సహజంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులే అన్నది పార్టీ నేతల అభిప్రాయం. కానీ ఇప్పుడు బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి? ఏ సీట్లలో ఎవరిని నిలబెట్టాలన్న అంశాన్ని వైసీపీ వ్యూహబృందమే సూచిస్తోందట. ఆ మేరకు బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా, అక్కడ మళ్లీ తామే గెలవాలన్నది వైసీపీ వ్యూహబృందం అసలు లక్ష్యం.

ఆ మేరకు గతంలో తమకు సాయపడిన బీజేపీలోని కొందరు కీలక నేతల ద్వారా, తన లక్ష్యం నెరవేర్చుకునే పనిలో ఉంది. ఇటీవల వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే ఒక బృందం టీడీపీపై మోదీ-అమిత్‌షాకు ఫిర్యాదు చేయడం వెనుక, ఇదే వైసీపీ వ్యూహబృందం ఉందన్నది బీజేపీ సీనియర్ల ఆరోపణ. అయితే రాజకీయాల్లో ఏ విషయం రహస్యం కాదు. ఒకరోజు అటో ఇటో.. మొత్తం ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బీజేపీలో సరిగ్గా అదే జరుగుతోంది.

బీజేపీకి కేటాయించిన 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, సుజనాచౌదరి, సత్యకుమార్ మినహా మిగిలిన వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని పార్లమెంటు, మరికొన్ని అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీ తీసుకోవాలని వైసీపీ వ్యూహబృందం, బీజేపీ ముఖ్య నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న చర్చ బీజేపీ వర్గాలను కలవరపరుస్తోంది.

ఆ మేరకు ఏయే స్థానాలు తీసుకోవాలి? ఏయే అభ్యర్ధులను ప్రకటించాలన్న జాబితాను కూడా, బీజేపీలోని తమ అనుకూల నేతలకు అందించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్‌లో పార్టీకి బలమైన నేత లేరు. వైసీపీని ఢీకొట్టే ఆర్ధికశక్తి ఉన్న వారు కూడా ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే పార్టీ నేతలు చందాలు ఇచ్చి, సాయం చేశారన్న చర్చ జరుగుతోంది. అలాంటి నియోజకవర్గాన్ని బీజేపీ ఎంచుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అది వైసీపీ ఖాతాలో వేయించే ప్రయత్నమేనన్నది బీజేపీ సీనియర్ల వాదన.

జనసేన నేత పోతిన మహేష్ రోజూ జనంలో ఉండే నేత. వైసీపీని ఎండగట్టే కృష్ణాజిల్లా జనసేన నేతల్లో ప్రధాన వ్యక్తి. పైగా అక్కడ సగర కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత. ఆయనకు బదులు ఆ సీటు బీజేపీ తీసుకోవడం వెనుక, వైసీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఇక రాజంపేట, హిందూపురం స్థానాలపై కూడా కోవర్టు ఆపరేషన్ నడుస్తోందన్నది పార్టీలో జరుగుతున్న ప్రచారం. ఆ రెండు స్థానాలకు బదులు విజయనగరం, తిరుపతి తీసుకోవాలని సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ యువ ఎంపీ.. బీజేపీ అగ్రనేతతో రాయబారం నిడిపిన వైనం పార్టీ వర్గాల్లో రచ్చయింది. ఓ.వెంకటరెడ్డి అనే వ్యక్తితో రాయబారం పంపిన వైనం వెలుగులోకి రావడంతో అది రచ్చయింది.

ప్రధానంగా రాజంపేట తీసుకోవాలని ఒకసారి, వద్దని మరోసారి సదరు ఎంపీ ఒత్తిడి చేశారట. రాష్ట్రంలో తయారవుతున్న మద్యం తయారీలో ప్రధాన బ్రాండ్లు ఆయన కంపెనీలవే. ఆమేరకు డిస్టలరీ యజమానులు బెదిరించి, లీజుతో తన జె బ్రాండ్లు తయారుచేసి అమ్ముతున్నారన్న ఆరోపణలు ఆయనపై ఎప్పటినుంచో ఉన్నాయి. టీడీపీ-బీజేపీ కూడా ఆమేరకు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గత కొద్దినెలల క్రితం బీజేపీ కూడా.. లిక్కర్ అమ్మకాలపై ఉద్యమం పేరుతో హడావిడి చేసింది. లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన కొంత డేటాను మాత్రమే విడుదల చేసింది. తర్వాత హటాత్తుగా లిక్కర్ ఉద్యమం అటకెక్కింది. దానికి కారణం ‘మామూలే’నన్నది బీజేపీ సీనియర్ల ఉవాచ. ఆ ‘అనుబంధం’తోనే సదరు రాజంపేట నేతతో, బీజేపీ అగ్రనేతకు పరిచయ పునాదులు బలపడ్డాయన్నది బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

ఇప్పుడు రాజంపేట సీటు బీజేపీ తీసుకోవద్దని, సదరు వైసీపీ యువనేత ఒత్తిడి చేస్తున్నారట. అటు టీడీపీ అధినేత బాబు.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట అభ్యర్ధిగా ఉంటే బాగుంటుందని సూచించారట. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో కిరణ్‌కు బంధుగణాలతోపాటు, సొంత నియోకవర్గం కూడా వస్తుంది. రాజంపేటలో మిధున్‌రెడ్డిని, చిత్తూరు జిల్లాలో ఆయన తండ్రిని ఓడించాలన్నది బాబు జీవితకాలపు పట్టుదల అన్నది బహిరంగమే. ఆ కుటుంబంతో అటు కిరణ్‌కూ దశాబ్దాల వైరం ఉంది. దానితో బీజేపీ అభ్యర్ధి బరిలో ఉంటే, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేయడం వైసీపీకి కష్టమవుతుంది. పైగా పోటీ తీవ్రంగా ఉంటుందన్నది వైసీపీ అసలు భయమని బీజేపీ వర్గాల విశ్లేషణ.

అందుకే రాజంపేట బదులు విజయనగరం తీసుకోవాలని, సదరు బీజేపీ అగ్రనేత ఢిల్లీ నాయకత్వాన్ని కోరారట. నిజానికి విజయనగరంలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది. అక్కడ విశాఖలో తనకు అనుకూలమైన అనుచరుడికి ఎంపీ సీటు ఇప్పించాలన్నది, సదరు బీజేపీ ముఖ్య నేత లక్ష్యమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు కించిత్తు బలం కూడా లేని విజయనగరం సీటు కోరడంపైనే పార్టీలో విస్మయం వ్యక్తమయింది. పోటీ ఇచ్చే రాజంపేట-హిందూపురం కాదని విజయనగరం-తిరుపతి సీటు అడగంతో.. తెరవెనుక ఏం జరుగుతోందో సులభంగానే అర్ధమవుతోందని బీజేపీ వర్గాలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇక హిందూపురం సీటు జీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌కు దక్కకుండా ఇదే వైసీపీ యువనేత, బీజేపీ రాష్ట్ర నేతలతో లాబీయింగ్ చేస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రోగి-వైద్యుడు చందంగా ఈ వ్యవహారం, బీజేపీ కీలక నేతకు కలసివచ్చిందట. ఒకవేళ సత్యకుమార్ గెలిస్తే కేంద్రమంత్రి పద వి రేసులో ఆయనే ముందుంటారు. అసలు భయం అదేనట.

ఒకసారి జాతీయ ప్రధాన కార్యదర్శి, మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా అడ్డుపడ్డ ఓ కీలక నేత.. ఇప్పుడు హిందూపురం ఎంపీ సీటు రాకుండా సదరు కీలక నేత అడ్డుపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ సత్యకుమార్‌కు హిందూపురం ఎంపీ సీటు కూడా దక్కకుండా చక్రం తిప్పుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదీ కమలంలో వైసీపీ కోవర్టుల కథ.