– ఏపీ టిడ్కో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కుమార్
విజయవాడ, మహానాడు: ఏపీ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని టిడ్కో ఆఫీసులో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాల్లోని గూడులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కృషి చేస్తానన్నారు. నా మీద నమ్మకంతో నాకు చాలా ప్రతిష్ఠాత్మకమైన పదవిని ఇచ్చినందుకు నమ్మకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్‌కి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పట్టణాల్లో అర్హులైన పేదలందరికీ టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. మా కుటుంబ సభ్యులే నాకు బలమని తెలిపారు. వేములపల్లి అనంతరామయ్య ప్రముఖ కమ్యునిస్టు లీడర్ గా, కార్పొరేటర్ గా, సంఘ సంస్కర్తగా మా ప్రాంతంలో పనిచేశారన్నారు. ఎంతో మంది పేదలకు ఆయన సేవలు అందించారన్నారు. ఆయన ఆశీస్సులే నన్ను ఇంతవాడిని చేశాయని ఆయన తెలిపారు.
పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన వారిలో పార్లమెంటు సభ్యులు వేమిరెడి ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యుడు లోకం నాగ మాధవి, శాసన మండలి సభ్యుడు పి.హరిప్రసాద్, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.